అల్లూరులో యువగళానికి పోటెత్తిన జనం! 150వరోజుకు చేరిన యువగళం పాదయాత్ర
యువనేతకు కావలి ప్రజల ఆత్మీయస్వాగతం
కావలి: రాష్ట్రంలో అంతమొందించడమే లక్ష్యంగా యువనేత Nara lokesh చేపట్టిన యువగళం పాదయాత్రకు కావలి అసెంబ్లీ నియోజకవర్గం జనం పోటెత్తారు. నారా లోకేష్ చేపట్టిన యువగళం శనివారానికి 150వరోజుకు చేరుకుంది. అల్లూరులో భారీఎత్తున ప్రజలు, టిడిపి నాయకులు, కార్యకర్తలు రోడ్లపైకి తరలివచ్చి యువనేతకు అపూర్వస్వాగతం పలికారు. విచిత్రవేషధారణలు, డప్పుశబ్ధాలు, బాణాసంచా మోతలతో అల్లూరు పట్టణం దద్దరిల్లింది. అల్లూరులో శ్రీ పోలేరమ్మ అమ్మవారి ఆలయంలో యువనేత లోకేష్ ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం పాదయాత్ర ప్రారంభించగా, స్థానిక ప్రజలు రోడ్డుకి ఇరువైపులా ఉన్న భవనాల పైకి ఎక్కి లోకేష్ కి అభివాదం చేశారు. మహిళలు, యువత, వృద్ధులను ఆప్యాయంగా పలకరించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కూరగాయల ధరలు ఆకాశాన్ని అంటాయి, విద్యుత్ ఛార్జీలు విపరీతంగా పెంచేశారు, సామాన్యులు బ్రతికే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తంచేశారు. రోడ్డుకి ఇరువైపులా షాపులు నిర్వహిస్తున్న వ్యాపారస్తులను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఇస్కపల్లిలో ఉప్పురైతులతో సమావేశమై వారి సాధకబాధకాలు తెలుసుకున్నారు. అల్లూరు నుంచి ప్రారంభమైన పాదయాత్ర ఇస్కపల్లి తూము, ఉడిపిగుంట, సింగారెడ్డి దిన్నె, ఊదూరుగుంట, ఎర్రప్పగుంట, ఇస్కపల్లి, పాతపాలెం, తాటిచెట్లపాలెం మీదుగా బంగారుపాలెం క్యాంప్ సైట్ కు చేరుకుంది. 150వరోజు యువనేత లోకేష్ 18.6 కి.మీ.పాదయాత్ర చేశారు. ఇప్పటివరకు యువగళం పాదయాత్ర 1968.9 కి.మీ.లు పూర్తయింది.
యువనేత ఎదుట వ్యక్తమైన సమస్యలు:
వయసు తక్కువని పెన్షన్ తొలగించారు -ఎమ్.రమణమ్మ, ఉడిపిగుంట
నాకు చంద్రబాబు హయాంలో పెన్షన్ మంజూరైంది. వైసిపి ప్రభుత్వం వచ్చాక రెండేళ్ల క్రితం నా పెన్షన్ తొలగించారు. నాలుగు సార్లు దరఖాస్తు చేసుకున్నా పట్టించుకోలేదు. ఈ ప్రభుత్వంలోనూ రూ.2,250 ఇచ్చే వరకు వచ్చింది. రూ.2,500లకు పెంచిన సమయంలో నా పెన్షన్ తొలగించారు. అడిగితే వయసు తక్కువ అని అంటున్నారు, నా వయసు 68 ఏళ్లు. కుంటిసాకులతో పెన్షన్ తొలగిస్తే మా లాంటి వాళ్లు ఎలా బతకాలి?
ధాన్యం డబ్బు ఎగ్గొట్టిన వ్యక్తికి కొమ్ము కాస్తున్నారు!-ఎస్.వెంకటసుబ్బయ్య, బట్రకాగొల్లు, అల్లూరు మండలం
2021లో మేము కూచిపూడి సురేష్ అనే వ్యాపారికి వడ్లు అమ్మాను. మా గ్రామంలోని రైతుల నుండి రూ.75 లక్షల విలువ చేసే ధాన్యాన్ని కొనుగోలు చేసిన ఆ వ్యక్తి సొమ్ము చెల్లించడం లేదు. దీనిపై మంత్రి అనిల్ కుమార్ ను కలిసి సమస్య చెప్తే నిర్లక్ష్యంగా సమాధానమిచ్చారు. పోలీసులు హైదరాబాద్ వెళ్లి అతడిని పట్టుకుని ఒత్తిళ్లు ఉన్నాయని వదిలేశారు. అప్పులు చేసి పంట పండించుకుంటే మా పొట్టకొట్టి పారిపోయాడు.
బ్రిడ్జి నిర్మించకపోవడంతో ఇబ్బంది పడుతున్నాం! వేలమూరి పద్మావతి, పేరంగుంట గ్రామం, అల్లూరు మండలం
మా గ్రామంలోని పైడేరు వాగుపై ఎన్నో ఏళ్లుగా బ్రిడ్జి లేక ఇబ్బంది పడుతున్నాం. పొలాలకు వెళ్లాలంటే పైడేరి వాగును దాటుకుని వెళ్లాలి. TDP హయాంలో 2019లో రూ.3 కోట్లతో బ్రిడ్జి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. కానీ ప్రభుత్వం మారాక దాన్ని పట్టించుకోలేదు. ఇప్పటి వరకు ఆ వాగులో పడి 30 మూగ జీవాలు మృతి చెందాయి. మా అత్త కూడా పడిపోయి చనిపోయింది. ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డికి ఎన్ని సార్లు చెప్పినా పట్టించుకోవడం లేదు.
ఉప్పురైతులకు సబ్సిడీపై విద్యుత్ అందజేస్తాం!
ఉప్పు నిల్వకోసం తీరప్రాంతంలో షెడ్లు నిర్మిస్తాం
రైతులకు ఇచ్చినవిధంగానే అన్ని సబ్సిడీలు ఇస్తాం
ఉప్పురైతులతో ముఖాముఖిలో యువనేత లోకేష్
కావలి: జగన్ పాలనలో ఉప్పు రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారు, విద్యుత్ ఛార్జీలు విపరీతంగా పెంచి ఉప్పు రైతులను కోలుకోలేని దెబ్బతీసాడు, టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే గతంలో మాదిరిగా రాయితీపై విద్యుత్ అందిస్తాం వైసీపీ పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తామని యువనేత నారా లోకేష్ పేర్కొన్నారు. కావలి నియోజకవర్గంలో ఇస్కపాలెంలో ఉప్పురైతులతో నిర్వహించిన సమావేశంలో లోకేష్ మాట్లాడుతూ… టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే ఉప్పు రైతులు పొలాల వద్దే నిల్వ చేసుకునే విధంగా షెడ్లు నిర్మాణం చేస్తాం. వరదలు, వర్షాలు వచ్చి ఉప్పు రైతులు నష్టపోయినప్పుడు ఇన్స్యూరెన్స్ కల్పించే అంశం పై నిపుణులతో చర్చించి నిర్ణయం తీసుకుంటాం. ఉప్పుపండించే ప్రాంతాల్లో రోడ్లు, మౌలిక వసతులు కల్పిస్తాం. ఇతర రైతులకు ఇచ్చిన్నట్టే సబ్సిడీలు అందిస్తాం. ట్రాక్టర్లు, ఇతర పనిముట్లు అందిస్తాం.
ఉప్పురైతులకు పట్టాలిచ్చే అంశాన్ని పరిశీలిస్తాం!
150 వ రోజు ఉప్పు రైతులతో సమావేశం పెట్టుకోవడం నాకు సంతోషంగా ఉంది. ఉప్పు లేనిదే కూర రుచి ఉండదు. ఉప్పు సత్యాగ్రహం చేసినప్పుడు గాంధీ గారు ఈ ప్రాంతానికి వచ్చారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తక్కువ ధరకే ఉప్పు రైతులకి విద్యుత్ అందజేశారు. నేను పంచాయతీ రాజ్ మంత్రిగా ఉన్నప్పుడు ఉప్పు సాగు చేసే పొలాలకు రోడ్లు కూడా వేసాం. ఉప్పు సాగు రైతులకు పట్టాలు ఇచ్చే అంశం పై పార్టీలో చర్చించి త్వరలోనే నిర్ణయం తీసుకుంటాం. కేంద్ర ప్రభుత్వానికి చెందిన భూమి కూడా ఉందని చెబుతున్నారు. దీని పై పూర్తి వివరాలు తీసుకొని స్పందిస్తా.
ఉప్పుసాగు రైతులు మాట్లాడుతూ…
జగన్ పరిపాలన వచ్చిన తరువాత ఉప్పు సాగు చేస్తున్న రైతులకి కనీస సాయం అందడం లేదు. విద్యుత్ ఛార్జీలు విపరీతంగా పెంచి ఉప్పు రైతులను జగన్ ప్రభుత్వం దోచుకుంటుంది. పండించిన ప్రతి పంటకు క్రాప్ ఇన్స్యూరెన్స్ ఉంది. ఉప్పు కి మాత్రం ఇన్స్యూరెన్స్ లేదు. వర్షాలు, వరదలు వచ్చనప్పుడు రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. అలాగే ఉప్పు నిల్వ చేసుకోవడానికి షెడ్లు ఏర్పాటు చేయాలి. పండించిన ఉప్పు తీసుకువెళ్ళడానికి రోడ్లు లేవు. ఎన్నో ఏళ్లుగా ఉప్పు సాగు చేసుకుంటున్నాం, మాకు పట్టాలు ఇప్పించాలి.
నారా లోకేష్ ను కలిసిన అల్లూరు మండల ప్రజలు
కావలి నియోజకవర్గం అల్లూరు మండలం గోగులపల్లి, సింగంపేట గ్రామాల ప్రజలు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. తూర్పుగోగులపల్లి గ్రామ పంచాయితీ పరిధిలో 5 గ్రామాలు ఉన్నాయి. ఈ గ్రామాల్లో గతంలో భూగర్భ డ్రైనేజీ నిర్మాణం ప్రారంభించగా, ప్రభుత్వం మారాక ముందుకు సాగలేదు. గోపాపురం ఆర్ అండ్ బి రోడ్డు నుంచి తూర్పు గోగులపల్లి వరకు మెయిన్ రోడ్డు పనులు పూర్తిచేయాలి. తూర్పుగోగులపల్లి పంచాయితీలో ఇళ్లులేని వారికి ఇళ్లు మంజూరు చేయాలి. దళితవాడలో శ్మశానానికి దారిలేదు, అక్కడ రోడ్డు నిర్మించాలి. అల్లూరుకు 4 కి.మీ.ల దూరంలో ఉన్న సింగంపేటను మున్సిపాలిటీలో కలపవద్దు. 4వేల జనాభా కలిగిన మా గ్రామంలో 2వేలమంది నిరుపేద గిరిజనులు ఉన్నారు. మున్సిపాలిటీలో విలీనం చేయడం వల్ల నరేగా పనులు కోల్పోవడంతోపాటు అధిక పన్నులు చెల్లించుకోలేక ఇబ్బంది పడుతున్నాం. గత నాలుగేళ్లుగా గ్రామంలోని చెలికసంఘం గిరిజన కాలనీకి తాగునీరు రానీయకుండా నిలిపివేశారు.
నారా లోకేష్ మాట్లాడుతూ
వైసీపీ అధికారంలోకి వచ్చాక గత నాలుగేళ్లుగా స్థానిక సంస్థలను పూర్తిగా నిర్వీర్యం చేశారు. శివారు గ్రామాల ప్రజల అభిప్రాయంతో సంబంధం లేకుండా పన్నుల బాదుడు కోసం మున్సిపాలిటీల్లో విలీనం చేశారు. ఎస్సీ, ఎస్టీలకు చెందాల్సిన 33,502 కోట్ల సబ్ ప్లాన్ నిధులను దారిమళ్లించారు. టిడిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే వైసిపి ప్రభుత్వం నిలిపివేసిన పెండింగ్ పనులన్నీ పూర్తిచేస్తాం. ఇల్లులేని ప్రతి పేదవాడికి పక్కా ఇల్లు నిర్మించి ఇస్తాం. ప్రతి ఇంటికీ కుళాయి అందజేసి 24/7 స్వచ్చమైన తాగునీరు అందిస్తాం. విలీన గ్రామాల సమస్యపై మెజారిటీ ప్రజల అభిప్రాయం మేరకు నిర్ణయం తీసుకుంటాం.
నారా లోకేష్ ను కలిసిన ఉడిపిగుంట గ్రామస్తులు
కావలి అసెంబ్లీ నియోజకవర్గం ఉడిపిగుంట గ్రామస్తులు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. మా గ్రామంలో గత ప్రభుత్వంలో 2 కి.మీ. వరకు రోడ్లు పూర్తిచేశారు. ప్రభుత్వం మారిన తర్వాత మిగిలిన రోడ్డుపనులు పూర్తిచేయకుండా వదిలివేశారు. గ్రామంలో ఇళ్లస్థలాలు మంజూరుచేసిన వారికి పట్టాలు ఇవ్వలేదు, పూర్తయిన గృహాలకు బిల్లులు మంజూరు చేయడం లేదు. వర్షాకాలంలో మురుగునీరు రోడ్లపై నిల్వ ఉండి, విషజ్వరాలు, అంటువ్యాధులు ప్రబలుతున్నాయి. వ్యవసాయపనులు లేని సమయంలో వలసలు వెళ్లాల్సి వస్తోంది, స్థానికంగా ఉపాధి అవకాశాలు కల్పించాలి. కొత్తగా నిర్మించిన కాలనీలకు సిసి రోడ్లు నిర్మించాలి.
నారా లోకేష్ మాట్లాడుతూ
వైసీపీ అధికారంలోకి వచ్చాక గ్రామీణాభివృద్ధి పూర్తిగా పడకేసింది. గ్రామసీమలను వైసిపి ప్రభుత్వం పూర్తిగా నిర్వీర్యం చేసింది. గత టిడిపి ప్రభుత్వ హయాంలో 25వేల కి.మీ.ల సిసి రోడ్లు నిర్మించాం. పేదలు నిర్మించుకున్న ఇళ్లకు బిల్లులు మంజూరుచేయకపోవడం దారుణం, టిడిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పెండింగ్ బిల్లులు అందజేస్తాం. గ్రామాల్లో రోడ్లు, డ్రైనేజి, ఇతర మౌలిక సదుపాయాలను కల్పిస్తాం.
నారా లోకేష్ ను కలిసిన ఊదూరుగుంట ప్రజలు
కావలి నియోజకవర్గం ఊదూరుగుంట ప్రజలు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. మా గ్రామంలో తాగునీటి సమస్య అధికంగా ఉంది, వచ్చే నీరు కూడా కలుషితమై వస్తోంది. గ్రామంలో 2 కి.మీ.ల సిసి రోడ్డు నిర్మించాలి. గ్రామంలో 150 గిరిజన కుటుంబాలు ఉన్నాయి, ఇళ్లబిల్లులు నాలుగేళ్లయినా చెల్లించలేదు. గిరిజన కుటుంబాలకు రేషన్ కార్డులు, ఇళ్లులేని వారికి ఇళ్లు మంజూరుచేయాలి. ఉపాధి హామీ పనులు లేక గ్రామంలోని ప్రజలు ఇతర ప్రాంతాలకు వలసపోతున్నారు, మాకు పనులు కల్పించాలి.
నారా లోకేష్ మాట్లాడుతూ
గ్రామాల్లో గుక్కెడు మంచినీళ్లు అందించలేని దివాలాకోరు ప్రభుత్వం రాజ్యమేలడం దౌర్భాగ్యం. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే ఇళ్లకు సంబంధించిన పెండింగ్ బిల్లులన్నీ మంజూరుచేస్తాం. వ్యవసాయానికి ఉపాధి సామీ పథకాన్ని అనుసంధానం చేసి పనులు కల్పిస్తాం. ప్రతి ఇంటికి కుళాయి అందజేసి, తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతాం.
నారా లోకేష్ ను కలిసిన ఎర్రప్పగుంట గ్రామస్తులు
కావలి అసెంబ్లీ నియోజకవర్గం ఎర్రప్పగుంట గ్రామస్తులు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. మా గ్రామంలో కి.మీ. వరకు రోడ్డు సరిగా లేదు, సిసి రోడ్డు నిర్మించాలి. తాగునీరు వారానికి ఒకరోజు వస్తున్నాయి, నిత్యం పనులకు వెళ్లే మేము నీటికి ఇబ్బంది పడుతున్నాం. కాలనీలో ఇళ్లస్థలాలు ఇవ్వకపోగా, సొంతస్థలాలు ఉన్న వారికి ఇళ్లు మంజూరు చేయడం లేదు. మీరు అదికారంలోకి వచ్చాక మా గ్రామసమస్యలు పరిష్కరించండి.
నారా లోకేష్ మాట్లాడుతూ
జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక గ్రామపంచాయితీలను పూర్తిగా నిర్వీర్యం చేశారు. పంచాయితీల అభివృద్ధికి ఫైనాన్స్ కమిషన్ విడుదల చేసిన రూ.8,660 కోట్ల నిధులను దారిమళ్లించారు. వైసీపీ ప్రభుత్వ నిర్వాకం కారణంగా గ్రామాల్లో బ్లీచింగ్ పౌడర్ చల్లడానికి కూడా నిధుల్లేని పరిస్థితి నెలకొంది. గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సమస్య పరిష్కారానికి కేంద్రం ప్రవేశపెట్టిన జల్ జీవన్ మిషన్ అమలులో రాష్ట్రం 18వస్థానంలో ఉంది. సెంటుపట్టాల పేరుతో అడ్డగోలు దోపిడీ తప్ప, పేదవాడికి ఇళ్లు నిర్మించడంలో ఈ ప్రభుత్వానికి శ్రద్ధలేదు. టిడిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఇంటింటికీ తాగునీటి కుళాయి అందజేస్తాం. ఇళ్లు లేని పేదలందరికీ పక్కా ఇళ్లు నిర్మించి ఇస్తాం.
నారా లోకేష్ ను కలిసిన పాతపాలెం గ్రామస్తులు
కావలి నియోజకవర్గం పాతపాలెం గ్రామస్తులు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. మా గ్రామం సముద్ర తీరానికి దగ్గరగా ఉండడంతో అలలు మా గ్రామం మీదకు వస్తున్నాయి. ప్రమాదపుటంచున మేం బిక్కు బిక్కుమంటూ బ్రతుకుతున్నాం. గతంలో ఎన్నోసార్లు అలల ధాటికి మా నివాసాలు కొట్టుకుపోయిన సందర్భాలు ఉన్నాయి. మాకు సురక్షిత ప్రాంతంలో ఇళ్ల స్థలాలు కేటాయించి ఇళ్లు కట్టించాలి. మా గ్రామంలో విద్యుత్ స్థంభాలు పూర్తిగా పాడైపోయాయి. వైర్లు తెగి రోడ్లు మీద పడుతున్నాయి, కొత్త విద్యుత్ లైన్లు వేసి మా ప్రాణాలు కాపాడాలి.
నారా లోకేష్ స్పందిస్తూ
వైసిపి నాయకులకు తీరప్రాంత ప్రజల ఓట్లపై ఉన్న శ్రద్ధ వారి సంక్షేమంపై లేదు. సముద్రతీర ప్రాంతాల్లో నివసించే ప్రజల కష్టాలను ప్రభుత్వం పట్టించుకోకపోవడం దురదృష్టకరం. టిడిపి అధికారంలోకి వచ్చాక వెంటనే పాతపాలెం గ్రామస్తులకు సురక్షిత ప్రాంతంలో ఇళ్లు నిర్మించి ఇస్తాం. గ్రామంలో రోడ్లు, డ్రైనేజీ, తాగునీరు వంటి మౌలిక సదుపాయాలు కల్పిస్తాం.
నారా లోకేష్ ను కలిసిన తాటిచెట్లపాలెం గ్రామస్తులు
కావలి నియోజకవర్గం తాటిచెట్లపాలెం గ్రామస్తులు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. మా గ్రామం సముద్రానికి 150 మీటర్ల దూరంలోనే ఉంది. మా గ్రామానికి 3కిలోమీటర్ల దూరంలో ఫిషింగ్ హార్బర్ నిర్మిస్తున్నారు. సముద్రం ఒడ్డునుండి కిలోమీటరు లోతు వరకు నిర్మాణాలు చేస్తున్నారు. సముద్రం ఆటుపోట్లు, ఫిషింగ్ హార్బర్ నిర్మాణ పనుల వల్ల మా గ్రామంలోకి నీరు వచ్చేస్తోంది. మా పంచాయతీలో 3వేల కుటుంబాలు ఉన్నాయి. మా గ్రామానికి, మాకు ఎలాంటి హాని జరగకుండా చర్యలు తీసుకోవాలి.
నారా లోకేష్ స్పందిస్తూ
సముద్రతీర ప్రాంతాల్లో నివసించే ప్రజలకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. ప్రమాదాలు జరిగేవరకు మీనమేషాలు లెక్కించడం సబబుకాదు. టిడిపి అధికారంలోకి వచ్చాక తీరప్రాంత ప్రజల రక్షణకు చర్యలు తీసుకుంటాం.
నారా లోకేష్ ను కలిసిన బంగారుపాలెం మత్స్యకారులు
కావలి అసెంబ్లీ నియోజకవర్గం బంగారుపాలెం గ్రామస్తులు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. మా గ్రామం సముద్ర తీరానికి అతి సమీపంలో ఉంది. గ్రామంలోని వారంతా చేపలవేటే జీవనాధారంగా బతుకుతున్నాం. అలిచర్ల బంగారుపాలెం, తీరప్రాంతాల నుండి వేటకు వెళ్లడానికి బకింగ్ హామ్ కెనాల్ పై బ్రిడ్జి నిర్మించాలి. పిషింగ్ హార్బర్ నుండి పాత కడపాలెం వరకు రోడ్డు నిర్మించాలి. కడలూరు-తమిళనాడు మధ్య పెద్దబోట్లతో తమిళనాడు మత్స్యకారులు మా ప్రాంతంలోకి వచ్చి చేపలవేట సాగిస్తున్నారు. దీనివల్ల మా జీవనాధారం దెబ్బతింటోంది. తమిళ జాలర్లను ఏపీ తీర ప్రాంతంలోకి రాకుండా చర్యలు తీసుకోవాలి. మీరు అధికారంలోకి వచ్చాక మా సమస్యల్ని పరిష్కరించాలి.
నారా లోకేష్ స్పందిస్తూ
సముద్రతీర ప్రాంతంలో మత్స్యకార గ్రామాలను వైసిపి ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం చేస్తోంది. పొరుగు రాష్ట్రాల మత్స్యకారులు రాష్ట్రంలోకి వస్తున్నా పట్టించుకోకపోవడం దారుణం. టిడిపి అధికారంలోకి వచ్చాక తీరప్రాంత గ్రామాల్లో అన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తాం. పొరుగు రాష్ట్రాల మత్స్యకారులు రాష్ట్రం పరిధిలోకి రాకుండా చర్యలు తీసుకుంటాం. ఫిషింగ్ హార్బర్ నుంచి పాత కడలూరు వరకు రోడ్డు నిర్మాణం చేపడతాం.
Also, Read This Blog: Nara Lokesh Yuvagalam: Driving Innovation and Excellence in Youth
Tagged: #LokeshPadaYatra#Padayatra#YuvaGalamLokesh#YuvaGalam#NaraLokeshPadaYatra#NaraLokesh