Naralokesh padayatra,Yuvagalam
Naralokesh padayatra,Yuvagalam

గూడూరు నియోజకవర్గంలో హోరెత్తిన యువగళం కోట బహిరంగసభకు కిటకిటలాడిన జనం

అడుగడుగునా యువనేతకు బ్రహ్మరథం..ఆత్మీయ స్వాగతం

గూడూరు: రాష్ట్రంలో అరా కపాలనను అంతమొందించడమే లక్ష్యంగా యువనేత Nara Lokesh చేపట్టిన యువగళం పాదయాత్ర గూడూరు అసెంబ్లీ నియోజకవర్గంలో హోరెత్తుతోంది. యువనేత లోకేష్ కు అడుగడుగునా జనం నీరాజనాలతో బ్రహ్మరథం పడుతున్నారు. భారీ గజమాలలతో సత్కరిస్తూ, హారతులు, పూలవర్షంతో గ్రామాల్లోకి యువనేతను స్వాగతిస్తున్నారు. 140వరోజు యువగళం పాదయాత్రకు గూడూరు నియోజకవర్గ ప్రజలనుంచి అనూహ్య స్పందన లభించింది. కోట గాంధీవిగ్రహం వద్ద నిర్వహించిన బహిరంగసభకు జనం పోటెత్తారు. నియోజకవర్గ నలుమూలల నుంచి తరలివచ్చిన ప్రజలతో కోట వీధులన్నీ కిటకిటలాడాయి. దారిపొడవునా యువనేత లోకేష్ కు వివిధ వర్గాల ప్రజలు ఆత్మీయ స్వాగతం పలుకుతూ సైకోపాలనలో తాము ఎదుర్కొంటున్న ఇబ్బందులను వివరించారు. మరో ఏడాదిలో రాబోయే చంద్రన్న ప్రభుత్వం అందరి సమస్యలను పరిష్కరిస్తుందని భరోసా ఇచ్చా ముందుకు సాగారు. వివిధ గ్రామాల ప్రజలు, గీత కార్మికులు, రైతులు, దళితులు, ఎస్సీలు, ఎస్టీలు యువనేత లోకేష్ ను కలిసి తమ సమస్యలు చెప్పుకున్నారు. కోట క్రాస్ వద్ద నుంచి ప్రారంభమైన పాదయాత్ర… గిరిజన కాలనీ, శ్యామసుందరపురం, ఆర్టీసి బస్టాండు, గాంధీసెంటర్, కొక్కుపాడు, సూరిశెట్టిపాలెం, చిలకలదిబ్బ, ఉత్తమనెల్లూరు, కర్లపూడిమీదుగా కాకువారిపాలెం క్యాంప్ సైట్ కు చేరుకుంది. 140 వరోజు యువనేత లోకేష్ 13.6 కి.మీ. లు పాదయాత్ర చేశారు. ఇప్పటివరకు యువగళం పాదయాత్ర 1835.2 కి.మీ.లు పూర్తయింది.

*వైసీపీ ఫిష్ ఆంధ్ర… యువత భవిత ఫినిష్ ఆంధ్ర!*

కోట పట్టణంలో మూతబడి ఉన్న ఫిష్ ఆంధ్ర మార్ట్ వద్ద సెల్ఫీ దిగిన లోకేష్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఇది గూడూరు నియోజకవర్గం కోట పట్టణంలో జగన్మోహన్ రెడ్డి ఏర్పాటుచేసి ఫిష్ ఆంధ్ర చేపల దుకాణం. చిత్తశుద్ది, అవగాహన లేమి కారణంగా ప్రారంభించిన కొద్దిరోజులకే ఫిష్ ఆంధ్రా కాస్త ఫినిష్ ఆంధ్రగా మారి,  పులివెందులతో సహా రాష్ట్రంలోని అన్ని దుకాణాలు మూతబడ్డాయి. కియా, ఫాక్స్ కాన్, సెల్ కాన్ వంటి పరిశ్రమలతో విజనరీ చంద్రబాబుగారు రాష్ట్రంలో లక్షలాదిమందికి ఉద్యోగాలిస్తే,  చేపలు, మాంసం దుకాణాల పేరుతో జగన్ యువత భవితను అంధకారమయం చేశారు. విజనరీ పాలనకు, విధ్వంసకుడి వికృత చర్యలకు తేడా ఇదే తమ్ముళ్లూ అంటూ లోకేష్ వ్యాఖ్యానించారు.

యువనేత ఎదుట వ్యక్తమైన సమస్యలు:

వైసీపీ సర్పంచ్ భూమి ఆక్రమించి దౌర్జన్యం చేస్తున్నారు!-కానిస్టేబుల్, ఓజిలి మండలం.

నేను కానిస్టేబుల్ గా పనిచేస్తున్నా. ఓజిలిమండలంలోని మా గ్రామంలో నా తల్లికి పూర్వీకుల నుండి వారసత్వంగా సుమారు 3.5ఎకరాల డీకేటీ పట్టా భూమి సంక్రమించింది. ఎన్నో ఏళ్లుగా మేం ఆ భూమిని సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాం. నా తండ్రి చనిపోయారు. నా తల్లికి 70సంవత్సరాలు. గుండె జబ్బు, పక్షవాతంతో ఇబ్బంది పడుతోంది. మా భూమిని మా గ్రామానికి చెందిన వైసీపీ సర్పంచ్ ఆక్రమించాడు. దీనిపై మేం రెవెన్యూ అధికారులను సంప్రదిస్తే భూమి మీ పేరు మీదే ఉంది. బీ1 ఫారం కూడా ఉంది కదా, మీకు అన్ని ఆధారాలు ఉన్నాయి, భయపడకండి అని చెబుతున్నారు. వైసీపీ నాయకుల దౌర్జన్యం పై పోలీసులకు ఫిర్యాదు చేస్తే కనీసం ఫిర్యాదు తీసుకోలేదు. నా భూమిని నేను ట్రాక్టర్ తో సాగుచేసుకుంటున్న సమయంలో వైసీపీ నేతలు నాపై దాడికి వచ్చారు. తిరిగి నాపైనే కేసు పెడితే ఎస్.ఐ ఏకపక్షంగా వ్యవహరించి, నన్ను నా భార్యను రాత్రి 11వరకు పోలీస్ స్టేషన్ లోనే పెట్టి వేధించారు. నా భవిష్యత్తు వైసీపీ నేతల చేతుల్లో నలిగిపోతోంది. మాకు న్యాయం చేసేవారు లేరు.

ప్రభుత్వం నుంచి సహాయం అందడంలేదు -చలువాది సంతోష్, వంజువాక, కోట మండలం

నా తండ్రికి కాలు లేదు. పంక్చర్ షాపు నిర్వహిస్తూ నన్ను 9 వరకు చదివించారు. తండ్రికి అనారోగ్యం రావడంతో షాపు నిర్వహణ నిలిచిపోయింది, కుటుంబం గడవడం కష్టంగా మారింది. తప్పని పరిస్థితుల్లో నేను చదువు మానేసి పంక్చర్ షాపు బాధ్యతలు చేపట్టాను. నా తండ్రికి సాయపడుతూ అండగా ఉంటున్నాను. సబ్సిడీ లోన్ ఇప్పించి షాపు ను అభివృద్ధి చేసుకునేందుకు సహకరించాలని అధికారులు, నాయకులను అడిగినా పట్టించుకోవడం లేదు. చాలీచాలని ఆదాయంతో కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాం. నా తండ్రి ఎక్కడికైనా వెళ్లాలన్నా ట్రై సైకిల్ లేదు. స్కూటీ కోసం దరఖాస్తు చేసుకున్నా ఎవరూ పట్టించుకోలేదు.

అంగన్ వాడీ భవనం అధ్వాన్నంగా ఉంది! -సంతోషమ్మ, కొక్కుపాడు గ్రామం, కోట మండలం.

మా గ్రామంలో అంగన్వాడీ సెంటర్ అధ్వానంగా ఉంది. కిటికీలు, మౌలిక సదుపాయాలు లేవు. రాత్రిపూట విష పురుగులు, పాములు అంగన్వాడీ సెంటర్లోకి వస్తున్నాయి. పిల్లలు స్కూలుకు వెళ్లిన సమయంలో అవి బయటకు వస్తున్నాయి. అధికారులు, నాయకులకు ఎన్నిసార్లు చెప్పినా ఎవరూ పట్టించుకోవడం లేదు. పసిపిల్లల ప్రాణాలను పణంగా పెట్టి అంగన్వాడీ సెంటర్ కు పంపాల్సివస్తోంది.

రాష్ట్రమంతటా యువగళం ప్రతిధ్వనులే!

మహిళల కష్టాలు తీర్చేందుకే మహాశక్తి!

సంపూర్ణ మద్యపాన నిషేధం తర్వాతే ఓట్లు అడుగుతా అన్నాడు. ఇప్పుడు ఎం మొఖం పెట్టుకొని ఓట్లు అడుగుతున్నాడు. 45 ఏళ్లకే బీసీ, ఎస్సి, ఎస్టీ మహిళలకు పెన్షన్ అన్నాడు. పెన్షన్ దేవుడెరుగు పాపం మహిళలు దాచుకున్న అభయహస్తం డబ్బులు 2500 కోట్లు కొట్టేసాడు. ఎంత మంది పిల్లలు ఉంటే అంతమందికి అమ్మ ఒడి ఇస్తా అని మోసం చేసాడు. మీ కష్టాలు చూసాను…కన్నీళ్లు తుడుస్తాను. భవిష్యత్తుకు గ్యారంటీ పేరుతో అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రకటించాం.  మహాశక్తి పథకం కింద… ఆడబిడ్డ నిధి:- 18 ఏళ్లు నిండిన మహిళలకు – నెలకు రూ.1500 అంటే ఏడాదికి రూ.18 వేలు, 5 ఏళ్లకు రూ.90 వేలు. 2) తల్లికి వందనం:- ప్రతి తల్లికి ఏడాదికి రూ.15 వేలు 3) దీపం పథకం:- ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితం 4) ఉచిత ప్రయాణం:- మహిళలకు ఉచిత ప్రయాణం. 

నిరుద్యోగులకు యువగళం నిధి ఇస్తాం!

జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదు, 2.30 లక్షల ఉద్యోగాలు ఇవ్వలేదు, ప్రతి ఏటా 6,500 పోలీసు ఉద్యోగాలు ఇవ్వలేదు, గ్రూప్2 లేదు, డిఎస్సి లేదు. ఉన్న అంబేద్కర్ స్టడీ సర్కిల్స్, బీసీ స్టడీ సర్కిల్స్ మూసేసాడు. జిఓ77 తీసుకొచ్చి ఉన్నత విద్య చదువుతున్న వారికీ ఫీజు రీయింబర్స్మెంట్  పధకం రద్దు చేసాడు. యువగళాన్ని విన్నాం. ప్రభుత్వ, ప్రైవేట్, స్వయం ఉపాధి ద్వారా 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం. నిరుద్యోగ యువతకు యువగళం నిధి కింద నెలకు రూ.3000 ఇస్తాం.  టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి ఏడాది నోటిఫికేషన్ ఇస్తాం. అన్ని జిల్లాల్లో స్టడీ సర్కిల్స్ ఏర్పాటు చేస్తాం.

మోటార్లకు మీటర్లు…రైతన్నలకు ఉరితాళ్లు

జగన్  రైతులు లేని రాజ్యం తెస్తున్నాడు. జగన్  పరిపాలనలో నకిలీ విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులతో రైతులు నష్టపోతున్నారు. రైతుల ఆత్మహత్యల్లో ఏపీ నంబర్ 3, కౌలు రైతుల ఆత్మహత్యల్లో నంబర్ 2.  రైతుల్ని ఆదుకోకపోగా ఇప్పుడు మీటర్లు పెడుతున్నాడు. మోటార్లకు మీటర్లు రైతులకు ఉరితాళ్లు. రైతుల బాధలు చూసాం. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే అన్నదాతకు ఏడాదికి రూ.20 వేలు ఇస్తాం.  జగన్ ఉద్యోగస్తులను వేధిస్తున్నాడు. వారంలో సీపీఎస్ రద్దు చేస్తా అని  200 వారాలు దాటినా సీపీఎస్ రద్దు చెయ్యలేదు. జీతం ఒకటో తారీఖున వచ్చే దిక్కు లేదు.  పోలీసులకు 4 సరెండర్స్, 8 టిఎ, డీఏలు పెండింగ్ పెట్టాడు. ఆఖరికి జిపిఎఫ్ డబ్బులు కూడా లేపేశారు. మెడికల్ బిల్లులు కూడా ఇవ్వడం లేదు.  పోలీసులు దాచుకున్న జిపిఎఫ్ డబ్బు సైతం కొట్టేసాడు. నేను ప్రతి రోజూ మాట్లాడుతుంటే భయపడి కొంత బకాయి తీర్చాడు. ఇంకా రావాల్సింది చాలా ఉంది.ఆఖరికి పెన్షనర్లకు పెన్షన్ ఇవ్వలేని చెత్త ప్రభుత్వం ఇది.

బిసి రక్షణ చట్టం తెస్తాం!

బీసీలు పడుతున్న కష్టాలు నేను చూసాను. 26 వేల అక్రమ కేసులు, నిధులు, కుర్చీలు లేని కార్పొరేషన్లు.  టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే ఉపకులాల వారీగా నిధులు, బీసీల కోసం ప్రత్యేక రక్షణ చట్టం తీసుకొస్తాం. 27 దళిత సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేసాడు.  టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే దళితులను వేధించిన వారిని కఠినంగా శిక్షిస్తాం. జగన్ రద్దు చేసిన 27 దళిత సంక్షేమ కార్యక్రమాలను తిరిగి ప్రారంభిస్తాం.

వైసిపి పాలనలో మైనారిటీలకు చిత్రహింసలు

జగన్ పాలనలో మైనార్టీలను చిత్ర హింసలకు గురిచేసాడు. అబ్దుల్ సలాం, కరీముల్లా, ఇబ్రహీం, మిస్బా, హాజిరా. ఇలా ఎంతో మంది బాధితులు. మైనార్టీలకు ఉన్న అన్ని సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేసాడు. దుల్హన్, విదేశీ విద్య, రంజాన్ తోఫా, ఇమామ్, మౌజమ్ లకు గౌరవ వేతనం, మసీదుల అభివృద్ధి కి నిధులు కూడా ఇవ్వడం లేదు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే పాత పధకాలు అమలు చెయ్యడంతో పాటు, ఇస్లామిక్ బ్యాంక్ ఏర్పాటు చేస్తాం.  రెడ్డి సోదరులు కూడా ఆలోచించాలి. 2019 ఎన్నికల్లో మీరు ఎంతో కష్టపడి డబ్బు ఖర్చు చేసి జగన్ ని గెలిపించుకున్నారు. ఇప్పుడు మీకు కనీస గౌరవం అయినా ఉందా. నాడు-నేడు అన్ని సామాజిక వర్గాలకు సమాన గౌరవం ఇచ్చింది ఒక్క టిడిపి మాత్రమే.

టిడిపి హయాంలోనే నెల్లూరు అభివృద్ధి!

ఒక్క నెల్లూరు సిటీ ని అభివృద్ధి చెయ్యడానికే గత టిడిపి ప్రభుత్వ హయాంలో 4,500 కోట్లు ఖర్చు చేసాం. ఇది నెవ్వర్ బిఫోర్, ఎవ్వర్ ఆఫ్టర్. నెల్లూరు సిటీ లో వెయ్యి కోట్లతో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ నిర్మిస్తే. నాలుగేళ్లలో 100 కోట్లు ఖర్చు చేసి పూర్తి చెయ్యలేని వేస్ట్ ఫెల్లోస్ వీళ్లు. ఒక్క నెల్లూరు టౌన్ లోనే 17 వేల టిడ్కో ఇళ్లు కట్టాం.  నెల్లూరు బ్యారేజ్ 90 శాతం, సంగం బ్యారేజ్ 70 శాతం, ఎస్ఎస్ కెనాల్ పనులు ఇలా చెప్పుకుంటూ పోతే ఒక్క రోజు సరిపోదు. కోపరేటివ్ జాయింట్ ఫార్మింగ్ సొసైటీ ఆధ్వర్యంలో ఉన్న 70 వేల ఎకరాల్లో రైతులకు పూర్తి హక్కులు కల్పిస్తూ పట్టాలు ఇచ్చాం. తెలుగుగంగ ప్రాజెక్టు కింద 2.30 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంటే అటవీ అనుమతులు లేక కేవలం లక్ష ఎకరాలకు మాత్రమే సాగునీరు అందేది. టిడిపి హయాంలో కేంద్ర ప్రభుత్వం తో పోరాడి అటవీ అనుమతులు తీసుకోని అదనంగా జిల్లాలో మరో 1.30 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాం.

నెల్లూరుకు పరిశ్రమలు తెచ్చింది మేమే!

 టిడిపి హయాంలో నెల్లూరు జిల్లాకి అనేక పరిశ్రమలు తీసుకొచ్చాం. వాటి ద్వారా 18 వేల కోట్ల పెట్టుబడి, 32 వేల మంది యువతకు ఉద్యోగ అవకాశాలు వచ్చాయి. గమేషా విండ్ టర్బైన్స్, ధర్మల్ పవర్ టెక్, సీపీ ఆక్వాకల్చర్, ఫెడోరా సీ ఫుడ్స్, అంజని టైల్స్, ఇండస్ కాఫీ ప్రై.లి, సౌత్ ఇండియా కృష్ణా ఆయిల్ అండ్ ఫాట్స్ ప్రై.లి, జెల్ కాప్స్ ఇండస్ట్రీస్, యూపీఐ పాలిమర్స్, పిన్నే ఫీడ్స్, బాస్ఫ్ ఇండియా లి., దొడ్ల డెయిరీ, పెన్వేర్ ప్రొడక్ట్స్ ప్రై.లి, అమరావతి టెక్స్ టైల్స్,అరబిందో ఫార్మా, ఓరెన్ హైడ్రోకార్బోన్స్ లాంటి ఎన్నో కంపెనీలు వచ్చాయి. నెల్లూరు జిల్లా కి చంద్రబాబు గారు చేసింది జగన్ చెయ్యాలంటే నాలుగు జన్మలెత్తాలి. 2019 లో ప్రజలు ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఉన్న 10 కి 10 సీట్లు వైసిపి కి ఇచ్చారు. నెల్లూరు జిల్లా ని వైసిపి నేతలు నాశనం చేసారు. ల్యాండ్, స్యాండ్, వైన్, మైన్, క్రికెట్ బెట్టింగ్ మాఫియాలకు అడ్డాగా మార్చేసారు.

రైతు సమస్యలు పట్టని వైసీపీ

రైతుల సమస్యలు పట్టించుకోడు. కల్తీ మద్యం మీద ఆయనకి ఫుల్లు అవగాహన ఉంది. కల్తీ విత్తనాల మీద అవగాహన లేదు.  అకాల వర్షాలతో రైతులు నష్టపోతే ఈయన కల్తీ లిక్కర్ తయారీ లో బిజీగా ఉంటాడు. ఈయన వలన జిల్లాలో ఒక్క రైతుకి న్యాయం జరగలేదు. ఇక మరో కీలక శాఖ పరిశ్రమల శాఖ మంత్రిగా గౌతమ్ రెడ్డి గారికి అవకాశం వచ్చింది. ఆయన మన మధ్య లేరు. పాపం ఆయన కంపెనీలు తేవాలి అని ప్రయత్నం చేసినా జగన్ పరిపాలన చూసి ఎవరూ రాలేదు. నెల్లూరు జిల్లా కి ఒక్క పరిశ్రమ రాలేదు.  మూడు కీలక శాఖలు నెల్లూరు జిల్లాకి వచ్చింది గుండు సున్నా. 2019 లో వైసిపి ఇచ్చిన పది సీట్లు మాకు ఇవ్వండి, అభివృద్ధి అంటే ఏంటో మేము చూపిస్తాం.

గూడూరు ఎమ్మెల్యే కలెక్షన్ ప్రసాద్!

గూడురు ని గొప్పగా అభివృద్ధి చేస్తారని 2019 ఎన్నికల్లో భారీ మెజారిటీతో వరప్రసాద్ రావు గారిని గెలిపించారు. గూడూరు కి గుండు కొట్టడం తప్ప చేసింది ఏమైనా ఉందా? ఒక్క దళితుడి జీవితం అయినా మారిందా? కష్టపడి వరప్రసాద్ గారిని గెలిపించుకున్న వైసిపి కార్యకర్తలు, నాయకులే వరప్రసాద్ గారి పేరుని కలక్షన్ ప్రసాద్ గా మార్చరట.  ఆయన పలకరింపు సూపర్ గా ఉంటుంది అంట అందరినీ బాగున్నావా నాన్న, ఎలా ఉన్నావ్ నాన్న అని పలకరిస్తారు కానీ పని మాత్రం జరగదు. 

కలెక్షన్ లెక్కు రాయడానికి 100మంది!

కలక్షన్ ప్రసాద్ అవినీతి ఏ రేంజ్ లో ఉందో తెలిస్తే స్టేట్ షాక్ అవుతుంది. ఇసుక,గ్రావెల్, సిలికా ట్రాన్స్ పోర్ట్ లో లెక్కలు పక్కాగా రాసేందుకు 100 మందిని పెట్టుకున్నారు. వీళ్ల పని ఏంటో తెలుసా? ఎన్ని లారీలు వెళ్లాయి, టైం, డేట్ అంతా రాసి రాత్రికి కలక్షన్ ఎంత వచ్చిందో చెప్పాలి. గూడూరు నియోజకవర్గంలో లో ఉన్న విలువైన సిలికా స్యాండ్ ని జగన్ అండ్ కంపెనీ కొట్టేసింది. ఈ దోపిడీ విలువ ఎంతో తెలుసా? 5 వేల కోట్లు. సిలికా, సిలికా స్యాండ్ వ్యాపారాలు ఒక్క ఛాన్స్ అనగానే పడిపోయారు.

గూడూరులో ప్రకృతివనరుల ధ్వంసం

గూడూరులో వైసిపి నేతలు ప్రకృతిని ధ్వంసం చేసారు. సోనకాలువలు ఎండిపోతున్నాయి, పొలాల్లో పంటలు పండటం లేదు, సిలికా గుంతల్లో పడి మనుషులు చనిపోతున్నారు, పశువులు చనిపోతున్నాయి. గూడూరు కి జగన్ అనేక హామీలు ఇచ్చాడు. ఒక్క హామీ కూడా నిలబెట్టుకోలేదు.  నేను మాట్లాడే ఈ సెంటర్ కి దగ్గర్లోనే స్వర్ణముఖి బ్యారేజ్ ఉంది. అర టిఎంసి నీరు కూడా నిల్వ పెట్టలేం. కానీ జగన్ స్వర్ణముఖి బ్యారేజ్ లో 2 టిఎంసి నీళ్లు నిల్వ చేసి కోట, వాకాడు, చిట్టమూరు మండలాల్లో చెరువులకు నీరు ఇస్తానని హామీ ఇచ్చాడు. హామీ నెరవేర్చడా? చెరువులకు నీళ్లు వచ్చాయా? తెలుగు గంగ లింక్ కాలువలు పూర్తి చేసి చెరువులకు నీరు ఇస్తానని చెప్పారు. ఇచ్చారా?  అటవీశాఖ అనుమతులు తెచ్చి వాకాడు, చిట్టమూరు మండలాల్లో గ్రామాలకు రోడ్లు, కరెంట్ ఇస్తానని చెప్పారు. ఇచ్చారా?

మత్స్యకారులను కూడా మోసం చేసిన వైసీపీ

దుగ్గరాజపట్నం, కోండూరు సముద్ర ముఖద్వారం వద్ద పూడిక తీస్తానని హామీ ఇచ్చి మర్చిపోయారు.  గూడూరు పట్టణంలో ఫ్లై ఓవర్ నిర్మిస్తామని హామీ ఇచ్చారు. ఆ హామీ గాల్లో కలిసిపోయింది. చిల్లకూరు,కోట,వాకాడు,చిట్టమూరు మండలాల్లో 7 వేల ఎకరాల్లో ఆక్వా సాగు జరుగుతుంది. విద్యుత్ ఛార్జీలు, పెట్టుబడి పెంచి వైసీపీ  ఆక్వా రైతుల్ని కోలుకోలేని దెబ్బతీశాడు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే ఆక్వా జోన్ తో సంబంధం లేకుండా సబ్సిడీలు అందిస్తాం. వైసీపీ పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తాం. తూర్పు-పడమర గూడూరు ని కలుపుతూ ఫ్లై ఓవర్ నిర్మాణానికి టిడిపి హయాంలో 63 కోట్లు మంజూరు చేసాం. ఈ ప్రభుత్వం ఆ పనులు పట్టించుకోలేదు. టిడిపి అధికారంలోకి వచ్చిన ఆ పనులు పూర్తిచేస్తాం.

నిమ్మరైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తాం

నిమ్మ రైతుల కష్టాలు నాకు తెలుసు. మీ పెట్టుబడి తగ్గించి గిట్టుబాటు కల్పిస్తాం.  పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసి ప్రతి ఎకరాకు సాగునీరు అందిస్తాం. వాటర్ గ్రిడ్ పధకం ద్వారా ప్రతి ఇంటికి కుళాయి ద్వారా తాగునీరు అందిస్తాం. పరిశ్రమలు తీసుకొచ్చి స్థానికంగా యువతకు ఉపాధి కల్పిస్తాం.  టిడిపి హయాంలో పేదలకు 5,102 టిడ్కో ఇళ్ళు నిర్మిస్తే వాటిని ఇవ్వకుండా వైసిపి ప్రభుత్వం వేధిస్తుంది. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే లబ్దిదారులకు టిడ్కో ఇళ్లు అందిస్తాం.  టిడిపి కార్యకర్తల జోలికి వచ్చిన ఏ ఒక్కరిని వదిలిపెట్టను. పారిపోయినా పట్టుకొచ్చి లోపలేస్తాం. పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తల్ని గుండెల్లో పెట్టుకుంటా.

యువనేత లోకేష్ ను కలిసిన కోట పట్టణ ప్రజలు

గూడూరు నియోజకవర్గం  కోట పట్టణ ప్రజలు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. కోట పట్టణంలో దళితవాడ మీదుగా వెళ్లే పంట కాల్వ ఆక్రమణకు గురైంది. పంట కాల్వలోకి మురుగునీరు కలవడం వల్ల దోమల బెడద, అనారోగ్య సమస్యలు ఏర్పడుతున్నాయి. డ్రైనేజీ సమస్యను పరిష్కరించేలా నిధులు కేటాయించాలి. 450 ఎకరాలకు పైగా ఆయకట్టుకు నీరందించే పంట కాలువ పూడిక తొలగించి, సిమెంట్ లైనింగ్ తో ఆయకట్టు నీరు పారేలా చేయాలి.  మా గ్రామ గిరిజన కాలనీలో ఎన్టీఆర్ హయాంలో పక్కా గృహాలు నిర్మించి ఇచ్చారు. ప్రస్తుతం ఆ ఇళ్లు దెబ్బతిని శిథిలావస్థలో ఉన్నాయి. గ్రామంలోని శ్యామసుందరపురం కాలనీ ఏర్పడి 30 ఏళ్లు అయింది. ఇప్పుటికీ పలు వీధుల్లో డ్రైనేజీ, రహదారులు, నీటి వసతి వంటి మౌళిక సదుపాయాలు లేవు. మీ ప్రభుత్వం కోట పట్టణంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలి.

నారా లోకేష్ మాట్లాడుతూ

జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక ఎస్సీ, ఎస్టీల సంక్షేమాన్ని పూర్తిగా నిర్లక్ష్యంచేశారు. ఎస్సీ, ఎస్టీలకు చెందాల్సిన 33,502 కోట్లు దారిమళ్లించిన వైసీపీ. దళితులు నివసించే ప్రాంతంలో పంట కాల్వలోకి డ్రైనేజీ నీటిని కలపడం దారుణం. టిడిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మురుగునీటి పారుదలకు ప్రత్యేకంగా డ్రైనేజీలను నిర్మించి దోమల సమస్యను నివారిస్తాం. పంట కాలువ పూడిక తొలగించి, సిమెంట్ లైనింగ్ తో ఆయకట్టు నీరు పారేలా చేస్తాం. కోట పట్టణంలో ఎస్సీ, ఎస్టీలు,  ఇళ్లు లేని పేదలందరికీ ఇళ్లు నిర్మించి ఇస్తాం. పట్టణంలో రోడ్లు, డ్రైనేజి, తాగునీరు వంటి మౌలిక సదుపాయాలను కల్పిస్తాం.

నారా లోకేష్ ను కలిసిన కోట కల్లుగీత కార్మికులు

గూడూరు నియోజకవర్గం కోట ఆర్టీసి బస్టాండు వద్ద కల్లుగీత కార్మికులు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. TDP పాలనలో మాకు అనేక సంక్షేమ పథకాలు అమలయ్యాయి. మీరు అధికారంలోకి వచ్చాక 30శాతం బ్రాందీ షాపులను మాకు కేటాయించాలి. కల్లుగీత చెట్లు పెంచుకునేందుకు జీఓ ఎంఎస్-560తో ప్రతి సొసైటీకి 5ఎకరాలు మించకుండా ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. కానీ ఆ జిఓ అమలు కాకపోవడంతో ఇబ్బందులు పడుతున్నాం. రాష్ట్రంలో ఉన్న వెయ్యి సొసైటీలకు ఒక్కో సొసైటీకి లక్ష చొప్పున రూ.10కోట్లు కేటాయించాలి. కల్లు గీత చెట్టు అంతరించిపోతున్నందున సముద్రతీర ప్రాంతాల్లో తాటి,ఈత,కొబ్బరిచెట్టను పెంచి గీత కార్మికులను ఆదుకోవాలి. చెట్ల యజమానులకు ఎక్కువ రేట్లు చెల్లించుకోలేక ఇబ్బందులు పడుతున్నాం. వన సంరక్షణ సమితులతో మాకు భాగస్వామ్యం కల్పించి గీత చెట్లను పెంచేందుకు అవకాశం కల్పించాలి.

నారా లోకేష్ స్పందిస్తూ

బిసిల ఓట్లతో అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి బిసిల నడ్డి విరుస్తున్నారు. గత నాలుగేళ్లలో బిసిలకు చెందాల్సిన రూ.75,760 కోట్ల సబ్ ప్లాన్ నిధులను దారిమళ్లించి తీరని అన్యాయం చేశారు. టిడిపి అధికారంలోకి వచ్చాక కల్లుగీత కార్మికులకు మద్యం షాపుల్లో రిజర్వేషన్ అమలుచేస్తాం. నీరా కేఫ్ లు పెట్టి కల్లు గీత కార్మికులకు ఉపాధికి చర్యలు తీసుకుంటాం. ఉపాధి హామీతో అనుసంధానం చేసి సముద్రతీర ప్రాంతాల్లో తాటిచెట్ల పెంపకానికి చర్యలు తీసుకుంటాం. వనసంరక్షణ సమితుల్లో గీత కార్మికులకు అవకాశం కల్పించి, తాటిచెట్ల పెంపకానికి అవకాశం కల్పిస్తాం.

నారా లోకేష్ ను కలిసిన ఉత్తమ నెల్లూరు గ్రామస్తులు

గూడూరు నియోజకవర్గం  ఉత్తమ నెల్లూరు గ్రామస్తులు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. గ్రామంలో సీసీ రోడ్లు లేవు… మీ ప్రభుత్వం వచ్చాక సీసీ రోడ్లు నిర్మించండి. టీడీపీ ప్రభుత్వం వచ్చాక కాలనీలు ఏర్పాటు చేసి, ఇళ్లులేనివారికి పక్కా ఇళ్లు ఇప్పించాలి. మా ప్రాంతంలో ఆక్వాసాగు సుమారు 10 వేల ఎకరాలకు పైగా ఉంది. విద్యుత్ బిల్లులు పెంచడం వల్ల ఆక్వా రైతులు ఇబ్బంది పడుతున్నారు. టీడీపీ ప్రభుత్వం వచ్చాక ఆక్వా రైతులను ఆదుకోవాలి.  కరెంట్ బిల్లులు తగ్గించేలా భరోసా కల్పించాలి.

నారా లోకేష్ మాట్లాడుతూ

రాష్ట్రంలో వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గ్రామాల్లో పరిస్థితి దుర్భరంగా మారింది.  టీడీపీ ప్రభుత్వం రాగానే పంచాయితీలను పరిపుష్టం చేసి, సీసీ రోడ్లు, డ్రైనేజీలు, ఇతర మౌలిక సదుపాయాలు కల్పిస్తాం. అధికారంలోకి వచ్చాక ఇళ్లులేని వారందరికీ  పక్కా గృహాలలు నిరిస్మాం. జగన్ అధికారంలోకి వచ్చాక ఆక్వా రైతులు క్రాప్ హాలిడే ప్రకటించాల్సిన దుస్థితి నెలకొంది. ఆక్వారైతులకు 1.50 పైసలకే విద్యుత్ ఇస్తానన్న జగన్ రూ.4 వసూలు చేస్తున్నాడు. టిడిపి అధికారంలోకి వచ్చాక ఆక్వారైతాంగానికి 1.50పైసలకే విద్యుత్ అందజేస్తాం.

నారా లోకేష్ ను కలిసిన కర్లపూడి గ్రామప్రజలు

గూడూరు నియోజకవర్గం కర్లపూడి గ్రామప్రజలు యువనేత లోకేష్ ను కలిసి తాము ఎదుర్కొంటున్న సమస్యలపై వినతిపత్రం సమర్పించారు. కర్లపూడి గ్రామంలో గత నాలుగేళ్లుగా వ్యవసాయ రంగం కుంటుపడింది. నాణ్యతలేని విత్తనాలు, కల్తీ ఎరువుల కారణంగా అన్నదాతలు అప్పుల పాలవుతున్నారు. గతం కంటే ఎరువులు, పురుగుమందుల ధరలు విపరీతంగా పెరిగాయి.  పంటలకు గిట్టుబాటు ధర లేక రైతులు ఇబ్బంది పడుతున్నారు. టీడీపీ హయాంలో వృద్ధాప్య, వికలాంగ, ఒంటరిమహిళలకు పెన్షన్లు అందాయి. కానీ వైసీపీ ప్రభుత్వం వచ్చాక రకరకాల కారణాలతో పెన్షన్లు తొలగించారు. టీడీపీ హయాంలో నిర్మించుకున్న ఎన్టీఆర్ గృహాలకు బిల్లులను ఈ ప్రభుత్వం నిలిపేసింది. బిల్లులు రాక ఇంటి నిర్మాణం కోసం తెచ్చుకున్న అప్పులు చెల్లించలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. మా గ్రామంలో ఇప్పటి వరకూ ఒక్క ఇంటిని కూడా ఈ ప్రభుత్వం నిర్మించలేదు. గ్రామంలోని రైతులు నీటి సమస్య ఎదుర్కొంటున్నారు, లిఫ్ట్ ఇరిగేషన్ ఏర్పాటు చేయాలి. సముద్రం సమీపంలో ఉండటంతో బోర్లలో ఉప్పు నీరు వస్తోంది..దీంతో తాగునీరు, సాగునీరుకు ఇబ్బంది పడుతున్నాం. మా గ్రామంలో నెలకొన్న తాగు, సాగునీటి సమస్యలను పరిష్కరించండి.

*నారా లోకేష్ మాట్లాడుతూ..

వైసీపీ చేతగాని పాలన కారణంగా వైసీపీ ప్రభుత్వం వచ్చాక వ్యవసాయ రంగం సంక్షోభంలోకి కూరుకుపోయింది. గత నాలుగేళ్ల వైసిపి పాలనలో రైతుల ఆత్మహత్యల్లో ఏపీ 3వ స్థానం, కౌలు రైతుల ఆత్మహత్యల్లో 2వ స్థానానికి చేరుకుంది. టీడీపీ వచ్చాక నకిలీ విత్తనాల విక్రేతలపై పీడీ యాక్టు ఉక్కుపాద మోపుతాం. ఎపి సీడ్స్ ద్వారా రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు అందజేస్తాం.  టీడీపీ వచ్చాక వైసీపీ ప్రభుత్వం కుంటిసాకులతో తొలగించిన పెన్షన్లన్నీ పునరుద్ధరిస్తాం. పేదల ఇళ్లకు సంబంధించి పెండింగ్ బిల్లులన్నీ క్లియర్ చేస్తాం. వాటర్ గ్రిడ్ ఏర్పాటుచేసి సాగు, తాగునీటి ఇబ్బందులను పరిష్కరిస్తాం.

Also, Read This Blog : Nara Lokesh Yuvagalam: Transforming Dreams into Reality

Tagged#LokeshPadaYatra#Padayatra#YuvaGalamLokesh#YuvaGalam#NaraLokeshPadaYatra#NaraLokesh

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *