ఆత్మకూరు నియోజకవర్గంలో ఉత్సాహంగా యువగళం! దారిపొడవునా జనం నీరాజనాలు… వినతుల వెల్లువ ఆప్యాయంగా పలకరిస్తూ ముందుకు సాగిన యువనేత
ఆత్మకూరు: అరాచకపాలనను అంతమొందించడమే లక్ష్యంగా యువనేత Nara Lokesh చేపట్టిన యువగళం పాదయాత్ర ఆత్మకూరు అసెంబ్లీ నియోజకవర్గంలో ఉత్సాహంగా సాగుతోంది. 127వరోజు పాదయాత్ర ఆత్మకూరు నియోజకవర్గం బొమ్మవరం క్యాంప్ సైట్ నుంచి ప్రారంభమైంది. అడుగడుగునా ప్రజలు యువనేతకు నీరాజనాలు పడుతూ తాము ఎదుర్కొంటున్న సమస్యలను విన్నవించారు. అందరి సమస్యలు ఓపిగ్గా విన్న లోకేష్ మరో ఏడాదిలో రాబోయే చంద్రన్న ప్రభుత్వం పరిష్కారం చూపుతుందని భరోసా ఇచ్చి ముందుకు సాగారు. పాదయాత్ర దారిలో మహిళలు, యువకులు, వివిధవర్గాల ప్రజలు యువనేతను కలిసి సమస్యలను విన్నవించారు. బొమ్మవరం క్యాంప్ సైట్ యువత, పాస్టర్లతో ముఖాముఖి సమావేశమై వారి సాధకబాధకాలు తెలుసుకున్నారు. చిలకలమర్రిలో భవిష్యత్తు కు గ్యారంటీ పేరుతో యువనేత కరపత్రాలు పంపిణీ చేశారు. మహానాడు వేదికగా పార్టీ అధినేత ప్రకటించిన హామీలను ప్రజలకు వివరించారు. మహిళలు, యువత, వృద్దులు, రైతులకు ఇచ్చిన ప్రతి హామీని చెబుతూ అధికారంలోకి వచ్చాక అమలుచేసి తీరుతామని అన్నారు. గౌరవరంలో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. బొమ్మవరం, గుడిగుంట, చిలకలమర్రి, మంగుపల్లి, కామిరెడ్డిపాడు, గౌరవరం మీదుగా అనంతసాగరం శివారు క్యాంప్ కు చేరుకుంది. 127వరోజున యువనేత లోకేష్ 12.9 కి.మీ. దూరం పాదయాత్ర చేశారు. ఇప్పటివరకు యువగళం పాదయత్ర 1623.9 కి.మీ. మేర పూర్తయింది.
యువనేత ఎదుట వ్యక్తమైన సమస్యలు:
*కరెంటు బిల్లు షాక్ కొడుతుందయ్యా!*
*లోకేష్ ఎదుట ఓ మహిళ ఆవేదన*
వైసిపి ప్రభుత్వం వచ్చాక కరెంటు బిల్లు షాక్ కొడుతోందని యువనేత లోకేష్ ఎదుట ఓ మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. గౌరవరానికి చెందిన రమణమ్మ అనే మహిళ పాదయాత్రదారిలో యువనేత లోకేష్ ను కలిసి ఈనెలలో వచ్చిన బిల్లుతోపాటు గతంలో వచ్చిన బిల్లును చూపించింది. ఇంటిలో రెండు లైట్లు, ఒక ఫ్యాన్ మాత్రమే ఉన్నాయి. గతంలో నెలకు 180రూపాయలు మాత్రమే వచ్చేది, ఇప్పుడు రూ.480 వచ్చింది. రీడింగ్ తీసే వాడ్ని అడిగితే మాకు తెలియదు, ప్రభుత్వం చెప్పిన ప్రకారమే బిల్లు తీస్తున్నామంటున్నారు. వ్యవసాయం గిట్టుబాటు లేక నానా అగచాట్లు పడుతున్నాం, మూలిగే నక్కమీద తాటిపండు మాదిరిగా కరెంటు బిల్లు, ఇంటిపన్నులు పెంచేస్తే మేం ఎలా బతకాలయ్యా అంటూ వాపోయింది. ఫ్యాన్ ను పర్మినెంట్ గా స్విచ్చాఫ్ చేయడమే ఈ సమస్యకు పరిష్కారం, ఒక్క ఏడాది ఓపిక పట్టండి… రాబోయే చంద్రన్న ప్రభుత్వం మీకు ఉపశమనం కలిగిస్తుందని భరోసా ఇచ్చి యువనేత ముందుకు సాగారు.
గ్రామ సమస్యలు గాలికొదిలేశారు!-రాజయ్య, పిల్లలమర్రి గ్రామం, ఆత్మకూరు నియోజకవర్గం.
మా గ్రామం సెంటర్ లో ట్రాన్స్ ఫార్మర్ ఉంది. అది చిన్న పిల్లలకు అందే అంత ఎత్తులో ప్రమాదకర పరిస్థితుల్లో ఉంది. దీనిపై అధికారులు, నాయకులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదు. మా గ్రామంలో డ్రైనేజిలన్నీ చెత్త, చెదారంతో పూడిపోయాయి. 4 ఏళ్లుగా మా సమస్యల్ని పట్టించుకునేవారు లేరు. మురుగు నీరు రోడ్లపై పారుతోంది. పారిశుద్ధ్యాన్ని ఎవరూ పట్టించుకోవడంలేదు.
మంచినీళ్లు కొనుక్కొని తాగుతున్నాం.-పాలూరి వెంకటేశ్వర్లు, గౌరవరం, ఆత్మకూరు నియోజకవర్గం.
మా గ్రామంలో తాగునీరు, మంచినీరు లేదు. 20 లీటర్ల క్యాన్ 5రూపాయలు పెట్టి కొనుక్కోవాల్సి వస్తోంది. గత ప్రభుత్వంలో వాటర్ ట్యాంకు నిర్మాణం పూర్తయినా, నాలుగేళ్లలుగా ప్రారంభించకుండా నిరుపయోగంగా ఉంచారు. మా గ్రామంలో 100 మంది ఇళ్లస్థలాలిచ్చి పెండింగ్ లో పెట్టారు. టిడిపివాళ్లను ఏరివేసి వాలంటీర్లకు, కార్యకర్తలకు ఇచ్చుకున్నారు. అదేమని అడిగితే దిక్కున్నచోట చెప్పుకోండని అంటున్నారు.
వైసీపీమాట తప్పారు! జైకార్, పాస్టర్, ఆత్మకూరు
పాస్టర్లకు ఎన్నికల ముందు నెలానెలా రూ.5 వేలు గౌరవ వేతనం ఇస్తానని జగన్ హామీ ఇచ్చారు. ఆ ఎన్నికల్లో పాస్టర్లు అందరం జగన్ గెలుపునకు పని చేశాం. అధికారంలోకి వచ్చిన రెండేళ్ల తర్వాత అందరికీ కాకుండా కొందరికి మాత్రమే అమలు చేశారు. నాకు ఏడాది పాటు ఇచ్చారు..ఆరు నెలల క్రితం తొలగించారు. ఒక సంవత్సరం ఒకరికి ఇస్తే.. మరొక సంవత్సరం రాదు. నిరంతరంగా ఇవ్వడం లేదు. జగన్ ఎన్నికల సమయంలో ఇచ్చిన మాట తప్పారు.
*యువనేత లోకేష్ ఎదుట మైనారిటీ కార్యకర్త ఆవేదన*
వైసిపినేతలు తనను కక్షగట్టి వేధిస్తన్నారని సంగం మండలం పడమటి నాయుడుపాలెంకు చెందిన షేక్ రసూల్ ఆవేదన వ్యక్తంచేశాడు. బొమ్మవరం క్యాంప్ సైట్ లో లోకేష్ ను కలిసి తమ గోడు విన్పిస్తూ… 2020లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో నేను, నా భార్య నామినేషన్లు వేస్తే, వైసిపినేతలు వత్తిడి చేసి ఉపసంహరింపజేశారు. ఆ తర్వాత 2021 మే 2వ తేదీన చింతకాయల ఆదిలక్ష్మి అనే మహిళతో రేప్, హత్యాయత్నం కేసులు బనాయించారు. దీనిపై నేను చంద్రబాబు గారిని పార్టీ కేంద్ర కార్యాలయంలో కలిసి నా కష్టాలు చెప్పుకున్నాను. అనంతరం పార్టీ పెద్దలు నాకు అండగా నిలిచి బెయిల్ ఇప్పించి బయటకు తీసుకొచ్చారు. మాపై కేసు పెట్టిన మహిళను బెదిరించినట్లు మరోసారి మాపై అక్రమంగా కేసు పెట్టించి వేధిస్తున్నారు. నా తల్లి షేక్ బీబీ జాన్ (80సం.లు) వీధి కుళాయి వద్ద దాడిచేసి గాయపర్చారు. వైసీపీ నాయకులు మా కుటుంబాన్ని కక్షగట్టి వేధిస్తున్నారని చెప్పాడు. అధైర్య పడొద్దని, పార్టీ అండగా నిలుస్తుందని యువనేత లోకేష్ భరోసా ఇచ్చారు.
వైకాపా నేత కొడుకు కులంపేరుతో దూషించాడు-జంగం దేవేంద్రకుమార్, నాగులవెల్లటూరు, చేజర్ల మండలం.
2022 నవంబర్ 29న వైకాపా నాయకుడికి కొడుకు దవుపాటి రవితేజ అయ్యప్పమాలలో ఉన్న నన్ను కులంపేరుతో దూషించి, మీ దిక్కున్న చోట చెప్పుకోండని అన్నాడు. ఆ తర్వాత నేనే మా గ్రామస్తుల సహకారంతో చేజర్ల పోలీస్ స్టేషన్ లో రవితేజపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టాను. పోలీసులు నేటికీ నిందితుడిపై చర్యలు తీసుకోలేదు. మీరు మాకు న్యాయండని కోరాడు. టిడిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దళితులను వేధించిన వైసిపినేతలపై కఠిన చర్యలు తీసుకుంటానని లోకేష్ హామీ ఇచ్చారు.
జగన్ పాలనలో కంపెనీలు పారిపోతున్నాయి అధికారంలోకి వచ్చక నిరుద్యోగ భృతి కల్పిస్తాం
పరిశ్రమలు రప్పించి 20లక్షల ఉద్యోగాలిస్తాం హలో లోకేష్ కార్యక్రమంలో యువనేత లోకేష్
ఆత్మకూరు: యువత భవిత కోసమే నేను యువగళం మొదలుపెట్టాను, చంద్రబాబు గారి పాలనలో ఏపి జాబ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా గా ఉంది, ఆత్మకూరు నియోజకవర్గం బొమ్మవరం క్యాంప్ సైట్ లో హలో లోకేష్ పేరుతో యువతతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా యువనేత మాట్లాడుతూ… పరిపాలన ఒకే చోట… అభివృద్ది వికేంద్రీకరణ మా నినాదం, అభివృద్ది వికేంద్రీకరణ చేసి చూపించింది టిడిపి. విజనరీ పాలనలో హెచ్సిఎల్, కాండ్యుయెంట్, కియా, టిసిఎల్, డిక్షన్ లాంటి కంపెనీలు వచ్చాయి. పాలనలో కంపెనీలు ఇతర రాష్ట్రాలకు పారిపోయాయి. ఫాక్స్ కాన్, రిలయన్స్, అమర్ రాజా లాంటి కంపెనీలు ఇతర రాష్ట్రాలకు వెళ్లిపోయాయి. ఆయన ఇచ్చే పప్పూ, బెల్లం పై ఆయన చెప్పు చేతల్లో ఉండాలి అనుకోవడమే జగన్ ఫ్యాక్షన్ మెంటాలిటీ. కంపెనీలు తీసుకొచ్చి, అందరికి ఉద్యోగాలు కల్పించాలి, రాష్ట్రం అభవృద్ధి చెంది అందరూ సొంత కాళ్ళ పై నిలబడాలి అనుకునేది విజనరీ చంద్రబాబు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే ఫైబర్ గ్రిడ్ ని పటిష్ఠంగా అమలు చేసి అన్ని గ్రామాలకు తక్కువ ధరకే హై స్పీడ్ ఇంటర్నెట్ అందిస్తాం. తద్వారా వర్క్ ఫ్రం హోమ్ కల్చర్ అభివృద్ది చేస్తాం.
8.32లక్షల ఉద్యోగాలిచ్చాం!
టిడిపి అధికారంలోకి ఉన్నపుడు రాయలసీమను ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్స్ హబ్ గా తీర్చిదిద్దాం. విశాఖ కి ఐటి కంపెనీలు తీసుకొచ్చాం. ఒక్కో జిల్లా ని ఒక్కో రంగంలో అభివృద్ది చెయ్యాలి అనే లక్ష్యంతో పనిచేశాం. టిడిపి హయాంలో 8.32 లక్షల ఉద్యోగాలు కల్పించాం. డిఎస్సీ ద్వారా 32 వేల మందికి ఉద్యోగాలు కల్పించాం. టిడిపి హయాంలో 6 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించిందని వైసిపి ప్రభుత్వం మండలి సాక్షి గా ప్రకటించింది. స్వయం ఉపాధి లో మరో 2 లక్షల ఉద్యోగాలు కల్పించాం. డిఎస్సీ ద్వారా 32 వేలు అన్ని కలిపి 8.32 లక్షల ఉద్యోగాలు ఐదేళ్లలో ఇచ్చాం. పాలిచ్చే ఆవు వద్దనుకొని తన్నే దున్నపోతు ని తెచ్చుకున్నారు. 2.30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తామని చేసాడు. మెగా డిఎస్సీ ఏర్పాటు చేస్తానని మోసం చేశాడు జగన్. జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదు. ప్రతి ఏడాది 6500 కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేస్తానని జగన్ మోసం చేసాడు.
20లక్షల ఉద్యోగాలిస్తాం!
టిడిపి అధికారంలోకి వచ్చిన తరువాత ప్రభుత్వ, ప్రైవేట్, స్వయం ఉపాధి లో 20 లక్షల మందికి ఉద్యోగాలు కల్పిస్తాం. ఇతర రాష్ట్రాలకు వెళ్లి ఉద్యోగాలు చెయ్యాల్సిన దుస్థితి మనకెందుకు? ఐదేళ్లు మాకు ఇవ్వండి ఇతర రాష్ట్రాల వారు మన రాష్ట్రానికి ఉద్యోగాల కోసం వచ్చేలా చేస్తాం. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి నియోజకవర్గంలో ఐటి ఉద్యోగాలు కల్పించే విధంగా రూరల్ డెవలప్మెంట్ సెంటర్లు ఏర్పాటు చేస్తాం. తక్కువ ఖర్చుతో కంపెనీలు రూరల్ డెవలప్మెంట్ సెంటర్లు ఏర్పాటు చేసేలా ప్రోత్సాహం అందిస్తాం. తద్వారా యువతకు స్థానికంగానే ఉద్యోగాలు వస్తాయి. నియోజకవర్గ స్థాయిలో ఐటి ఉద్యోగాలు కల్పించాలి అనే లక్ష్యంతో పని చేస్తాం.
ఫీజు రీఎంబర్స్ మెంట్ పునరుద్దరిస్తాం
టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే విదేశీ విద్య పథకం అమలు చేస్తాం. జగన్ రద్దు చేసిన పీజీ ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని తిరిగి అమలు చేస్తాం. పోలీసు శాఖ కి నిధులు పెంచాలి. పోలీసు శాఖని బలోపేతం చేస్తాం. పోలీసు శాఖలో ఖాళీ పోస్టులు భర్తీ చేస్తాం. యూపిపిఎస్సీసి తరహాలో ఏపిపిఎస్సీ ని పటిష్ఠ పరుస్తాం. రాజకీయ జోక్యం లేకుండా చేస్తాం. రాజకీయ పునరావాస కేంద్రం లా కాకుండా అవసరమైతే చట్టం మారుస్తాం. జిల్లాల విభజన శాస్త్రీయ పద్ధతిలో చెయ్యలేదు. రాజకీయాల కోసం జిల్లాలు విభజించారు. కనీస మౌలిక సదుపాయాలు కూడా లేకుండా జిల్లాల విభజన చేశారు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే జరిగిన తప్పులు సరి చేస్తాం. జిల్లాలకి అవసరమైన మౌలిక సదుపాయాలు, ఇంజనీరింగ్, మెడికల్ కాలేజీలు, ఇతర కాలేజీలు ఏర్పాటు చేస్తాం.
కెజి టు పిజి సిలబస్ ప్రక్షాళన చేస్తాం
టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే కేజీ టూ పీజీ సబ్జెక్ట్ మొత్తం ప్రక్షాళన చేస్తాం. జాబ్ రెడీ యూత్ ని సిద్దం చేస్తాం. డిఎస్సీ నిర్వహించి పెండింగ్ టీచర్ల పోస్టులు భర్తీ చేస్తాం. జగన్ కి స్కిల్ డెవలప్మెంట్ ఏ శాఖ కిందకి వస్తుందో కూడా తెలియదు. అక్కడ పని చేసే వారిపై ఒత్తిడి చేసి నాపై కేసు పెట్టాలని చూసారు. నేను ఏ తప్పు చెయ్యలేదు కాబట్టి ఏమి పికలేకపోయారు. టిడిపి అధికారంలోకి వచ్చిన స్కిల్ డెవలప్మెంట్ పటిష్ఠంగా అమలు చేస్తాం. కాలేజీ – కంపెనీ కనెక్ట్ తీసుకొస్తాం. కెరియర్ కౌన్సిలింగ్ ఇప్పిస్తాం. కెరియర్ కౌన్సిలర్స్ ని ఏర్పాటు చేస్తాం. ఏ రంగంలోకి వెళ్తే ఎటువంటి అవకాశాలు ఉంటాయి అనేది కెరియర్ కౌన్సిలర్స ద్వారా గైడెన్స్ ఇప్పిస్తాం.. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకి టిడిపి హయాంలో భద్రత ఉండేది. క్రమం తప్పకుండా జీతాలు ఇచ్చే వాళ్ళం, జీతాలు పెంచాం. ఇప్పుడు జగన్ ప్రభుత్వం ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను జీతాలు ఇవ్వకుండా వేధిస్తుంది.
నిరుద్యోగ భృతి ఇస్తాం
అధికారంలోకి వచ్చాక సోమశిల ముంపు బాధితులకు న్యాయం చేస్తాం. బ్యాక్ లాగ్ పోస్టులు అన్ని భర్తీ చేస్తాం. మొదటి వంద రోజుల్లోనే నిరుద్యోగ భృతి రూ.3 వేలు అందజేస్తాం. అన్ని కులాల కార్పొరేషన్లు బలోపేతం చేస్తాం. స్వయం ఉపాధికి సాయం అందిస్తాం. ఎస్సీ, ఎస్టీ యువత ను పారిశ్రామిక వేత్తలుగా మారుస్తాం. జగన్ ప్రభుత్వం రద్దు చేసిన 27 దళిత సంక్షేమ కార్యక్రమాలు తిరిగి ప్రారంభిస్తాం. జగన్ పాలనలో దళితులకు రక్షణ లేదు. సిఎం సొంత నియోజకవర్గం పులివెందుల లో దళితుడు జంద్యాల కృష్ణయ్య ను కొట్టి చంపేశారు. పులివెందుల లో నాగమ్మ అనే దళిత మహిళ ను అత్యాచారం చేసి చంపేశారు. టిడిపి దళిత నాయకులు పోరాడితే వారి పై ఎస్సీ, ఎస్టీ కేసులు పెట్టిన దుర్మార్గపు పాలన జగన్ ది. ఇప్పుడు నాగమ్మ కుటుంబాన్ని మాయం చేశారు. విజనరీ కి ప్రిజనరి కి యువత తేడా తెలుసుకోవాలి. విజనరీ చంద్రబాబు గారి పాలనలో కియా మేడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్, సెల్ ఫోన్ మేడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్, టివి మేడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్.
రేపటితరానికి వారధి లోకేష్: రాంనారాయణరెడ్డి
50 శాతం కి పైగా ఆత్మకూరు యువత ఇతర రాష్ట్రాలకు వెళ్లి పనిచేస్తున్నారు. ఆత్మకూరు నియోజకవర్గంలో ఉపాధి అవకాశాలు కల్పించాలి. పరిశ్రమలు పెద్ద ఎత్తున తీసుకొచ్చి స్థానికంగా ఉద్యోగాలు కల్పించాలి. అందరూ ఊర్లు ఖాళీ చేసి వెళ్తున్నారు. కేవలం వృద్దులు మాత్రమే ఉంటున్నారు. ఆత్మకూరు లో ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటు చేయాలి అనే కల ఎప్పటి నుండో ఉంది. లోకేష్ రేపటి తరానికి వారధిగా ఉండాలి అని కోరుకుంటున్నాను.
లోకేష్ ఎదుట యువతీయువకుల ఆవేదన
జగన్ పాలనలో జాబ్ క్యాలెండర్ విడుదల కాలేదు, పరిశ్రమలు రావడం లేదు. రాష్ట్రంలో ఐటి కంపెనీలు లేక ఇతర రాష్ట్రాలు వెళ్లి అనేక ఇబ్బందులు పడుతున్నామని పలువురు యువతీయువకులు ఆవేదన వ్యక్తంచేశారు .ఆత్మకూరు నియోజకవర్గానికి వచ్చిన సెంచురీ ప్లై వుడ్ పరిశ్రమను జగన్ వేరే చోటకి తరలించారు. జగన్ పాలనలో కానిస్టేబుల్ పోస్టుల భర్తీలో అనేక అవకతవకలు జరుగుతున్నాయి. ఆత్మకూరు లో ప్రభుత్వ ఇంజినీరింగ్ కళాశాల ఏర్పాటు చెయ్యాలి. జగన్ పాలనలో స్కిల్ డెవలప్మెంట్ ని నిర్వీర్యం చేసారు. అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వడం లేదు.సోమశిల ముంపు బాధితులకు ఉద్యోగాలు ఇస్తామని ఇవ్వలేదు. జగన్ ప్రభుత్వం ఫైబర్ గ్రిడ్ పథకాన్ని నిర్వీర్యం చేశారు. మీరు అధికారంలోకి వచ్చాక ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ ఇచ్చి ఆదుకోండి.
అపోహలు నమ్మొద్దు…టిడిపి అందరిదీ!
ఏ మతాన్ని మేము చిన్న చూపు చూడం.. దళిత క్రైస్తవులకు లబ్ధి చేకూరేలా టిడిపి గతంలో చేసిన తీర్మానానికి కట్టుబడి ఉన్నాం. మొదటి సారి సిఎం అయినప్పుడే చంద్రబాబు గారు చర్చిల నిర్మాణానికి సహాయం చేశారు. పాస్టర్లు అనేక సమస్యలు ఎదుర్కుంటున్నారు. జగన్ పాలనలో పాస్టర్ల కి కనీస గౌరవం లేదు. జగన్ పాలనలో క్రైస్తవులు కూడా బాధితులే. జగన్ పాలనలో పాస్టర్ల మీద దాడులు జరుగుతున్నాయి. చర్చిల్లో విబేధాలు సృష్టిస్తున్నారు. క్రిస్టియన్ల సమస్యలు పరిష్కారం కోసమే టిడిపి క్రిస్టియన్ సెల్ ని బలోపేతం చేస్తున్నాం. టిడిపి హయాంలో ఏ మతం పైనా దాడులు జరగలేదు. గుడి పై దాడి జరిగినప్పుడు చంద్రబాబు గారు వెళితే కొంత మంది విమర్శించారు. ఏ మతం మీద దాడి జరిగినా మొదట స్పందించేది చంద్రబాబు గారు. బిజెపి తో పొత్తులో ఉన్నప్పుడే క్రిస్మస్ కానుక ఇచ్చాం. హైదరాబాద్ లో మత ఘర్షణలు జరిగినప్పుడు వాటిని కంట్రోల్ చేసింది చంద్రబాబు గారు. టిడిపి అధికారంలోకి వచ్చాక క్రైస్తవ సోదరుల సంక్షేమానికి అవసరమైన అన్ని చర్యలూ తీసుకుంటాం.
ముఖాముఖి సమావేశంలో పాస్టర్ల ఆవేదన
ఆత్మకూరు లో కేవలం ఇద్దరికి మాత్రమే ఇస్తున్నారు. అందులో మూడు నెలల నుండి ఒకరికి రావడం లేదని పాస్టర్లు ఆవేదన వ్యక్తంచేశారు. ముఖాముఖి సమావేశంలో యువనేత ఎదుట వారు తమ సమస్యలను తెలియజేస్తూ… లక్షకు పైగా ఇండిపెండెంట్ పాస్టర్లు ఉన్నారు. వారికి ప్రభుత్వం నుండి ఎటువంటి సాయం అందడం లేదు. క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్స్ ఏర్పాటు చేయాలి. ఇళ్లు నిర్మించి పాస్టర్ల కాలనీలు ఏర్పాటు చేయాలి. చర్చిల నిర్మాణం కోసం 5 సెంట్ల భూమి కేటాయించాలి. చర్చిల అభివృద్ది కి జగన్ ప్రభుత్వం నుండి ఎటువంటి సహాయం అందడం లేదు. పాస్టర్ల ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటు చేయాలి. పర్మినెంట్ మ్యారేజ్ లైసెన్స్ ప్రభుత్వం రద్దు చేసి ఇప్పుడు కేవలం మూడేళ్లకు రెన్యువల్ చేసుకోవాలి అని నిబంధన పెట్టింది. ప్రత్యేక స్మశానాలు లేక ఇబ్బంది పడుతున్నాం. హెల్త్ ఇన్స్యరెన్స్ లేక ఇబ్బంది పడుతున్నాం.
చర్చిల నిర్మాణానికి రూపాయి కూడా ఇవ్వలేదు!
క్రిష్టియన్ ఇళ్ళల్లో పెళ్లిలకు లక్ష రూపాయిలు ఆర్ధిక సాయం చేస్తామని చెప్పి జగన్ మాటతప్పారు. చనిపోతే ప్రభుత్వం నుండి కుటుంబానికి ఎటువంటి సాయం అందడం లేదు. క్రిస్టియన్, మైనార్టీ బోర్డు ద్వారా మాకు ఎటువంటి న్యాయం జరగడం లేదు. దీనిని విడదీసి పెడితే మాకు న్యాయం జరుగుతుంది. చర్చిల నిర్మాణం జగన్ ప్రభుత్వం ఈ రోజు వరకూ ఒక్క రూపాయి ఇవ్వలేదు. ఎటువంటి ష్యురిటి లేకుండా లక్ష రూపాయిలు వరకూ బ్యాంకు రుణాలు అందేలా చూడాలి. జెరూసలేం యాత్ర కు ఆర్ధిక సాయం అందించాలి. గత ప్రభుత్వం ఇచ్చిన క్రిస్మస్ కానుక కూడా జగన్ ప్రభుత్వం రద్దు చేసింది. పాస్టర్ల కు గుర్తింపు కార్డులు ఇవ్వాలి. జగన్ పాలనలో పాస్టర్ల కు కనీస గౌరవం దక్కడం లేదు. మేము ఏ పార్టీకి చెందిన వాళ్లం కాదు. మేము న్యాయం వైపు నిలబడతాం. క్రిస్మస్ కార్యక్రమానికి జగన్ ప్రభుత్వం ఎటువంటి సాయం ఇవ్వడం లేదు. ప్రార్థనలు నిర్వహించే సమయంలో కొన్ని సార్లు మాపై దాడులు జరుగుతున్నాయి. మాకు రక్షణ కల్పించాలి.
*యువనేతను కలిసిన గుడిగుంట గ్రామస్తులు
ఆత్మకూరు నియోజకవర్గం గుడిగుంట గ్రామస్తులు యువనేత లోకేష్ ను కలిసి సమస్యలను విన్నవించారు. సోమశిల ఉత్తర కాల్వ నుంచి కేతమన్నేరు వాగులో నీరు కలిసే చోట చెక్ డ్యామ్ నిర్మించాలి. దీనిద్వారా 5 గ్రామాల ప్రజలకు నీటిసమస్య తీరుతుంది. సోమశిల నుండి నాయుడుపల్లి ఫస్ట్ ఫేజ్ హైలెవల్ కెనాల్ పనులు కొన్నేళ్లుగా నిలిచిపోయాయి. కాలువ పనులు పూర్తి చేస్తే మా పంచాయతీకి తాగు, సాగు నీరు దొరుకుతుంది. సోమశిల ఉత్తర కాలువ 12-090 నుంచి 13-650 వరకు తారు రోడ్డు నిర్మిస్తే, కాల్వకు ఇరువైపులా రవాణా సౌకర్యం ఏర్పడుతుంది. మా గ్రామంలో స్కూల్ భవనం లేక పంచాయతీ భవనంలో పాఠశాల నడిపిస్తున్నాం. మీరు అధికారంలోకి వచ్చాక మా గ్రామ సమస్యలు పరిష్కరించండి.
నారా లోకేష్ స్పందిస్తూ…
జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మైనర్ ఇరిగేషన్ ను పూర్తిగా నిర్వీర్యం చేశారు. గత టిడిపి ప్రభుత్వంలో నీరు-చెట్టు పథకం కింద నీటిసంఘాల ద్వారా 18,265 కోట్లు వెచ్చించి, చెక్ డ్యామ్ ల నిర్మాణం, చెరువుల్లో పూడికతీత, గొలుసుకట్టు చెరువుల అభివద్ధికి కృషిచేశాం. వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆ పథకాన్ని రద్దుచేయడమేగాక, గతంలో చేసిన పనులకు సంబంధించి రూ.1277 కోట్లు పెండింగ్ లో పెట్టి రైతులను వేధించింది. చివరకు సంబంధిత బిల్లుల కోసం తెలుగుదేశం పార్టీ హైకోర్టులో న్యాయపోరాటం చేసింది. టిడిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సాగునీటిసంఘాలను బలోపేతం చేసి, మైనర్ ఇరిగేషన్ అభివృద్ధికి చర్యలు చేపడతాం. సోమశిల ప్రాజెక్టు హైలెవల్ కెనాల్ పనులను పూర్తిచేసి ఈ ప్రాంత రైతుల కష్టాలు తీరుస్తాం.
పత్తి చేలో దిగి రైతు కష్టాలు తెలుసుకున్న లోకేష్
ఆత్మకూరు నియోజకవర్గం గుడిగుంట క్రాస్ వద్ద పత్తిచేలో దిగిన లోకేష్, రైతు కష్టాలు తెలుసుకున్నారు. ఈ సందర్భ పత్తిరైతు కరణం రవి తమ ఇబ్బందులను తెలియజేస్తూ… రెండున్నర ఎకరాల్లో పత్తి సాగుచేశాను. ఎకరాకు 50వేలు ఖర్చయింది. విత్తనాల్లో నాణ్యత లేకపోవడం వల్ల ఎత్తు పెరిగింది కానీ కాపురాలేదు. గులాబీరంగు దోమవల్ల కాపు తగ్గిపోవడమేగాక గుడ్డిపత్తిగా మారి నాణ్యత తగ్గిపోయింది. 20 క్వింటాళ్లు రావాల్సింది 7 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది, క్వింటా 5వేలు పలుకుతోంది. నకిలీ విత్తనాల కారణంగా తీవ్రంగా నష్టపోయాను. డ్రిప్ లు లేకపోవడంతో పత్తిసాళ్లకు నీళ్లు పెట్టడం వల్ల గడ్డి ఎక్కువ పడుతోంది. కలుపుతీత ఖర్చులు భారీగా పెరిగాయి. మాకు డ్రిప్ సౌకర్యం కల్పిస్తే ఈ సమస్య ఉండదు. సోమశిల హైలెవల్ కెనాల్ పూర్తిచేసి, నీళ్లివ్వాలి. బోర్లతో తోడుకోవాల్సి వస్తోంది.
*నారా లోకేష్ మాట్లాడుతూ…*
వ్యవసాయమంత్రి మీ జిల్లా వాడే, ఆయన కోర్టులో పత్రాల చోరీ కేసులో సిబిఐ చుట్టూ తిరుగుతున్నాడు, మిమ్మల్ని పట్టించుకునే తీరిక ఆయనకు ఎక్కడుంది? గతంలో 90శాతం సబ్సిడీతో డ్రిప్ సౌకర్యం కల్పించడమేగాక ఇన్ పుట్ సబ్సిడీ ఇచ్చాం. రైతులు ఎట్టి పరిస్థితుల్లో మోటార్లకు మీటర్లు అంగీకరించొద్దు. అవి మీ మెడకు ఉరితాడుగా మారతాయి. టిడిపి అధికారంలోకి వచ్చాక నకిలీ విత్తనాల విక్రేతలపై ఉక్కుపాదం మోపుతాం. డ్రిప్ ఇరిగేషన్ తో పాటు గతంలో రైతులకు అమలుచేసిన సంక్షేమ పథకాలన్నీ పునరుద్దరిస్తాం. ఎపి సీడ్స్ ద్వారా రైతులకు నాణ్యమైన విత్తనాలు సరఫరా చేసేందుకు చర్యలు తీసుకుంటాం.
*నారా లోకేష్ ను కలిసిన మంగుపల్లి గ్రామస్తులు
ఆత్మకూరు నియోజకవర్గం మంగుపల్లి గ్రామస్తులు యువనేత లోకేష్ ను కలిసి సమస్యలను విన్నవించారు. అనంతసాగరం చెరువును ఆనుకుని నాలుగు గ్రామాల వారికి పట్టా భూములున్నాయి. చెరువు నిర్మాణకర్తలు దీనిపై అలుగు నిర్మించారు. నేటి పాలకులు అలుగు ఎత్తును పెంచారు. దీంతో చెరువును ఆనుకుని ఉన్న భూములు మునిగిపోతున్నాయి. మీరు అధికారంలోకి వచ్చాక పొలాలు మునిగిపోకుండా అలుగు ఎత్తు తగ్గించాలి.
*నారా లోకేష్ స్పందిస్తూ…*
లేని సమస్యలు సృష్టించడం, పరిష్కారం పేరుతో సెటిల్మెంట్లు చేయడం వారికి అలవాటుగా మారింది. తమ స్వార్థ ప్రయోజనాలకోసం రైతులను ఇబ్బందుల పాల్జేయడం దుర్మార్గం. టిడిపి అధికారంలోకి వచ్చాక రైతుల పొలాలకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటాం.
లోకేష్ ను కలిసిన కామిరెడ్డిపాడు గ్రామస్తులు
ఆత్మకూరు నియోజకవర్గం కామిరెడ్డిపాడు గ్రామస్తులు యువనేత లోకేష్ ను కలిసి సమస్యలను విన్నవించారు. అనంతసాగరం చెరువు అలుగు ఎత్తు పెంచడంతో మా పొలాలు ముంపునకు గురయ్యాయి. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. అలుగు ఎత్తు తగ్గించాలి. లిఫ్ట్ ఇరిగేషన్ రిపేరు రావడంతో నిరుపయోగంగా మారింది. రిపేరుకు కావాల్సిన ఎస్టిమేషన్ వేసి టెండర్ పిలవకుండా నిర్లక్ష్యం చేస్తున్నారు. మీరు అధికారంలోకి వచ్చాక మా సమస్యలు పరిష్కరించండి.
*నారా లోకేష్ స్పందిస్తూ…*
రైతుల కోసం కోట్లాదిరూపాయలతో గత ప్రభుత్వ హయాంలో లిఫ్ట్ ఇరిగేషన్ పథకాలు ఏర్పాటుచేస్తే నిర్వహణ నిధులు, కరెంటు బిల్లులు కట్టకుండా జగన్ ప్రభుత్వం నిరుపయోగంగా మార్చింది. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే లిఫ్ట్ ఇరిగేషన్ పథకాలన్నింటినీ తిరిగి వినియోగంలోకి తెచ్చి, రైతుల కష్టాలు తీరుస్తాం. రైతులకు ఇబ్బంది లేకుండా అనంతసాగరం అలుగు ఎత్తు సమస్యను పరిష్కరిస్తాం.
*నారా లోకేష్ ను కలిసిన గౌరవరం గ్రామస్తులు
ఆత్మకూరు నియోజకవర్గం గౌరవరం గ్రామస్తులు యువనేత లోకేష్ ను కలిసి సమస్యలను విన్నవించారు. TDP అధికారంలో ఉండగా మా గ్రామశివార్లలో ఉన్న స్థలాన్ని 63 మంది బీసీలకు ఇచ్చారు. అక్కడ కరెంటు, నీరు, మౌలిక సదుపాయాలు లేక మేము ఇళ్లు కట్టుకోలేదు. ఇళ్లు కట్టుకోలేదనే కారణంతో ప్రస్తుత ప్రభుత్వం మా స్థలాలు లాక్కుంది. మీరు అధికారంలోకి వచ్చాక మా స్థలాలు మాకు ఇప్పించండి. మా గ్రామం మీదుగా వెళుతున్న కాలువ ఎగువ భాగాన లిఫ్ట్ ఇరిగేషన్ ఏర్పాటు చేసి, ఎగువ పొలాలకు నీరు అందించండి. ఎన్టీఆర్ విగ్రహం నుండి ఎస్సీ కాలనీ వరకు, బస్టాండు నుండి ఎస్సీ కాలనీ వరకు సీసీ రోడ్డు నిర్మించాలి. గ్రామంలో మురుగు నీరు సమస్య తలెత్తకుండా డ్రైనేజీ ఏర్పాటు చేయాలి.
*నారా లోకేష్ మాట్లాడుతూ…*
జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చా పేదలకు సెంటుపట్టా పేరుతో రూ.7వేల కోట్లు దోచుకున్నారు. పేదలకు ఇచ్చిన ఇళ్లస్థలాల్లో మౌలిక సదుపాయాలు కల్పించడం చేతగాక, ఇల్లు కట్టుకోలేదన్న సాకుతో స్థలాలను లాగేసుకోవడం దారుణం. టిడిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే గౌరవరం బిసిలకు తిరిగి పట్టాలిచ్చి, ఇళ్లు నిర్మించి ఇస్తాం. ఎస్సీ కాలనీతోపాటు గ్రామంలో సిసి రోడ్లు, డ్రైనేజిలు, ఇతర మౌలిక సదుపాయాలను కల్పిస్తాం. రైతులకు కాల్వ ద్వారా సాగునీరు అందించేలా చర్యలు తీసుకుంటాం.
నారా లోకేష్ ను కలిసిన అనంతసాగరం ముస్లింలు
ఆత్మకూరు నియోజకవర్గం అనంతసాగరం సంజీవనగర్ లో ముస్లిం మైనారిటీలు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక దుల్హన్, రంజాన్ తోఫా వంటి పథకాలు ఎత్తేశారు. మైనారిటీలకు సబ్సిడీలోన్లు రద్దు చేశారు. మైనారిటీ విద్యార్థులకు అందాల్సిన స్కాలర్ షిప్ లు, విదేశీవిద్య రద్దుచేశారు. ఖాళీగా ఉన్న ఉర్దూ టీచర్ పోస్టు భర్తీ నిలిపేశారు. మౌజన్, ఇమామ్ లకు అందించే సంక్షేమ పథకాలు రద్దు చేశారు. మీరు అధికారంలోకి వచ్చాక గతంలో అమలుచేసిన పథకాలను పునరుద్దరించాలి. హజ్ యాత్రకు వెళ్లే హజ్ హౌస్ ను ప్రతి జిల్లాలో నిర్మించాలి.
నారా లోకేష్ స్పందిస్తూ…
ముఖ్యమంత్రి జగన్ కు వేలకోట్ల రూపాయల మైనారిటీల ఆస్తులపై తప్ప వారి సంక్షేమంపై శ్రద్ధ లేదు వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మైనారిటీలకు చెందాల్సిన రూ.5,400 కోట్ల సబ్ ప్లాన్ నిధులను దారిమళ్లించింది. మైనారిటీ కార్పొరేషన్ ను పూర్తిగా నిర్వీర్యం చేశారు. టిడిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఇస్లామిక్ బ్యాంక్ ఏర్పాటుచేస్తాం. గత ప్రభుత్వంలో ముస్లిం మైనారిటీలకు అమలుచేసిన పథకాలన్నీ పునరుద్దరిస్తాం. మైనారిటీల ఆస్తుల పరిరక్షణకు పటిష్టమైన చర్యలు తీసుకుంటాం. పూర్తి ప్రభుత్వ ఖర్చుతో పేద ముస్లింలను హజ్ యాత్రకు పంపిస్తాం.
యువనేతను కలిసిన విద్యుత్ మీటర్ రీడర్లు
ఆత్మకూరు నియోజకవర్గం అనంతసాగరం శివార్లలో ఆంధ్రప్రదేశ్ విద్యుత్ మీటర్ రీడర్స్ సంఘ ప్రతినిధులు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. ఎపి విద్యుత్ సంస్థ పరిధిలో 4,500 మంది మీటర్ రీడర్లం గత 25 సంవత్సరాలుగా పనిచేస్తున్నాం. నెలంతా కష్టపడినా మాకు రూ.10వేలు మించి రావడం లేదు. జగన్ పాదయాత్ర సమయంలో పీస్ రేట్ విధానాన్ని రద్దుచేసి ఫిక్స్ డ్ వేతనం అమలుచేస్తానని హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చాక మమ్మల్ని తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తూ పొమ్మనకుండా పొగబెడుతున్నారు. 14రోజుల్లో చేయాల్సిన పని 7రోజుల్లో చేయాలని టార్గెట్ పెట్టి మమ్మల్ని తీవ్ర ఇబ్బందులు పెడుతున్నారు. సాధ్యం కాదని చెబితే పనిచేయలేకపోతే ఉద్యోగం వదిలి వెళ్లాలని, మాకు సచివాలయం జెఎల్ఎం గ్రేడ్-2 సిబ్బంది ఉన్నారని బెదిరిస్తున్నారు. దీంతో మేము తీవ్ర మానసిక క్షోభకు గురవుతూ అనారోగ్యాల పాలవుతున్నాం. పనిదినాలు తగ్గించడంతో వేతనం తగ్గిపోయి కుటుంబ పోషణ భారంగా మారింది. ప్రభుత్వంపై చట్టసభల్లో వత్తిడి తెచ్చి మాకు న్యాయం జరిగేలా చూడండి.
నారా లోకేష్ స్పందిస్తూ..
ఇచ్చిన మాట తప్పడం, మడమ తిప్పడం జగన్మోహన్ రెడ్డికి వెన్నతో పెట్టిన విద్య. సిపిఎస్ రద్దు పేరుతో రాష్ట్రంలో లక్షలాది ఉద్యోగులను కూడా ఇదేవిధంగా వంచించి మోసం చేశాడు. సమస్యలపై ప్రశ్నించిన ఉద్యోగులు, టీచర్లను తప్పుడు కేసులతో బనాయించి వేధించడం దుర్మార్గం. న్యాయమైన డిమాండ్లతో మీటర్ రీడర్లు చేస్తున్న పోరాటానికి మద్దతు ఇస్తాం. మీటరు రీడర్ల సమస్యపై అసెంబ్లీలో ప్రస్తావించి న్యాయం జరిగేలా కృషిచేస్తాం. జగన్ ప్రభుత్వం స్పందించకపోతే టిడిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మీటర్ రీడర్లకు న్యాయం చేస్తాం.
Also Read This Blog:Building Bridges, Breaking Barriers: Yuvagalam Padayatra Fostering Youth Unity
Tagged: #LokeshPadaYatra#Padayatra#YuvaGalamLokesh#YuvaGalam#NaraLokeshPadaYatra#NaraLokesh